వేదికపై ఖాళీ కుర్చీ తీస్తాకు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ : మతతత్వంపై గళం విప్పుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం పోరాటం సాగిస్తున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఈ వారంలో స్లొవేనియాలోని బ్లెడ్‌లో జరిగే 55వ అంతర్జాతీయ రచయితల (శాంతి కమిటీ) సమావేశంలో ఆమెను ఖాళీ కుర్చీతో గౌరవిస్తారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మతపరమైన హింసాకాండలో ప్రధాని మోడీ పాత్రపై తీస్తా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధితులకు ఆమె గత రెండు దశాబ్దాలుగా అండగా ఉంటున్నారు. మతపరమైన నేరాలలో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ కార్యకర్తల ప్రమేయాన్ని ఎండగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తన కృషికి దేశంలో ఎదురు దెబ్బలు తగులుతుంటే అక్కడ తగిన గుర్తింపుతో గౌరవం దక్కడం చాలా సంతోషాన్ని ఇస్తోందని తీస్తా తెలిపారు. ‘నా తోడ్పాటుతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌కు, మా బృందానికి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సమాజాలకు ఇది గొప్ప విషయం’ అని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత శక్తివంతమైన వారు తనను లక్ష్యంగా చేసుకొని నిందలు వేస్తున్న సమయంలో ఈ గౌరవం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని పెన్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ‘గత సంవత్సరం జూన్‌ 25న గుజరాత్‌ పోలీసులకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం సెతల్వాద్‌ను ముంబయిలోని ఆమె నివాసంలో అరెస్ట్‌ చేసింది. గుజరాత్‌ హింసకు ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేసే ప్రయత్నంలో నేరపూరిత కుట్రకు పాల్పడిందని, నకిలీ సాక్ష్యాలను సృష్టించిందని ఆరోపించింది. గుజరాత్‌ హింసలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై నిగ్గు తేల్చేందుకు కేసును పునర్విచారించాలని తీస్తా, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన మరునాడే ఆమెను అరెస్ట్‌ చేశారు’ అని పెన్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. జైలుశిక్ష విధించబడిన, ఆచూకీ తెలియకుండా పోయిన రచయితలను గౌరవించేందుకు ఈ సంస్థ వేదికపై ఖాళీ కుర్చీలు వేస్తుంది. ప్రయాణ నిషేధం విధించబడిన వారిని కూడా గౌరవిస్తుంది. తీస్తాకు బెయిల్‌ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతుల కారణంగా ఆమె తన పాస్‌పోర్టును పోలీసులకు అందజేశారు. కాగా ప్రముఖ రచయిత సాల్మన్‌ రష్డీకి తొలిసారిగా ఇలాంటి గౌరవం లభించింది. మన దేశానికి సంబంధించి వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యావేత్త హనీ బాబు ఎంటీలకు ఈ గౌరవం దక్కింది.