ఇండిస్టీలోకి రాక ముందు ఎన్టీఆర్‌ని అభిమానించిన వ్యక్తి ఆయనతోనే ఇండిస్టీలోనే ఎప్పటికి మరపురాని ‘మల్టీస్టారర్’ తీయడం ఏంటీ! అక్కినేనిని చూసి స్టార్‌డం గ్రహించి ఆయనతో సినిమా నిర్మించడం ఏంటీ! ఆయన దేవదాసు వంటి కళాత్మక చిత్రాన్ని కలర్ స్కోప్‌లో మళ్ళీ నిర్మించడం ఏంటీ! నటన రాదు.. డ్యాన్సులు రావు అనే హీరోకి అతిధిపాత్రలు ఇచ్చి ఎన్నో చిన్న సినిమాలు పెద్ద హిట్లు అవ్వడం ఏంటీ…! తెలుగు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న బాపు వంటి డైరక్టర్లకి కష్ణావతారంగా డబ్బులు తెప్పించే మాస్ సినిమాలు అందించడం ఏంటీ..! ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం హీరో కృష్ణ. ఆయన హీరోకి పర్యాయ పదం?
తెలుగు సినీ పరిశ్రమలో మహామహులకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ ‘అసాధ్యుడి’గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. ఆయన సాధించిన రికార్డులు ఎప్పటికీ చెక్కు చెదరవు. భవిష్యత్తులో వాటిని చెరిపివేసే హీరో పుట్టలేడు. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం హీరో కృష్ణ రికార్డులు శాశ్వతంగా నిలిచిపోతాయి.
సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపానగల బుర్రుపాలెం అనే గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే నటనమీద ఆసక్తి కనబరచిన కృష్ణ తర్వాత సినీ రంగప్రవేశం చేసి ‘పదండి ముందుకు’, ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ వంటి చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న ‘తేనెమనసులు’ ప్రకటన చూసి ప్రయత్నించి, ఎంతో పోటీని తట్టుకుని సినిమాలో ముఖ్య భూమికను పోషించారు. ఆ సినిమా హిట్ అవటంతో ఆదుర్తి అదే తారాగణంతో ‘కన్నెమనసులు’ ప్రారంభించగా, అదే సమయంలో కృష్ణకు ‘గూఢచారి 116’లో అవకాశం దక్కింది. ‘కన్నె మనసులు’ పారాజయం పాలైనా గూఢచారి 116 విజయంతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు.
అనంతరం నిర్మాతల హీరోగా కీర్తిగడించిన కృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువ ‘తొలి’లు అందించిన వ్యక్తిగా నిలిచిపోయారు. తొలి సీక్రెట్ ఏజెంట్, తొలి కౌ బారు, తొలి సినిమా స్కోప్, తొలి 70 ఎమ్.ఎమ్. ఇలా అన్ని కృష్ణ పేరిటే ఉండటం విశేషం. సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కష్ణగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ స్థాపించి అనేక సినిమాలను తెరకెక్కించారు. భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబారు చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇప్పటికీ వెండి తెరపై చెరగని ముద్రే.
1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కష్ణతో కలిసి నటించిన హీరోయిన్ల సంఖ్య 80కి పైనే ఉంటుంది. ఇందులో విజయనిర్మలతో యాభై సినిమాలు, జయప్రదతో 43, శ్రీదేవితో 31 సినిమాలు చేశారు.
అత్యధిక డ్యూయల్ రోల్స్ (దాదాపు 25 సినిమాలు), అత్యధిక త్రిపాత్రాభినయాలు (ఏడు సినిమాలు) చేసిన హీరో కృష్ణనే. నాగేశ్వరరావు క్లాస్ అయితే, మిడిల్ క్లాస్ ఎన్‌టీయార్ అయితే, మాస్‌కి హీరో కృష్ణనే. అందుకే అత్యంత హార్డ్‌కోర్ అభిమానులు ఆయనకు సొంతం.
కష్ణ అన్ని కులాల హీరో. మైనారిటీ మతాల హీరో, సెక్యులర్ పీపుల్ హీరో. ఎన్‌టీయార్ రాముడు, కృష్ణుడు పాత్రలతో ఒక పురాణ పురుషుడిగా, హీరోగా తెరమీద విస్తరించినప్పుడు మిగతా వర్గాల వాళ్ళు సహజంగానే కృష్ణని ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు స్వయంగా అంగీకరించారు.
కృష్ణ చేసిన గొప్ప పని ఏమంటే తాను ఎదుగుతూ సినిమా రంగాన్ని విస్తరించారు. అతడు దాదాపు సినిమాలోని ప్రతి రంగంలో ప్రయోగాలు చేశారు. తెలుగునాట నుండి, దక్షిణాదికే గాక, దేశాన్ని దాటి, అంతర్జాతీయ స్థాయికి అంటే ఇంగ్లిష్‌లో డబ్ చేసి విడుదలచేసింది కృష్ణ సినిమానే. అది మోసగాళ్లకు మోసగాడు డబ్బింగ్ ‘ట్రెజర్ హంట్’.
అయితే అతడీ ప్రయోగాలు ఇతరుల డబ్బుమీద చేయలేదు. తనే నిర్మాతగా చేశారు. పద్మాలయా సంస్థ పేరుతో. అప్పట్లో ఎన్‌టీయార్ గానీ (రామకృష్ణా స్టూడియోస్), నాగేశ్వరరావ్ గానీ, ఇప్పటి నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్), చిరంజీవి (గీతా ఆర్ట్స్) గానీ సాహసించలేని సాహసాలన్నీ కృష్ణ చేయడం గమనార్హం. ఆయన మాత్రమే అల్లూరి సీతారామరాజు, సింహాసనం తీయగలిగారు. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పుడు బ్రహ్మాండమైన ‘బ్యాంగ్’తో మళ్లీ తనే నిర్మాతగా మారి సినిమాలు తీశారు. అసలు హీరోయిన్ లేని ‘ఈనాడు’ సినిమా అప్పట్లోనే తీయగలిగారు. ఆయన రైతుల, కార్మికుల సినిమాలు తీశారు. అతడు తీసినన్ని సామాజిక విషయాల మీద మరెవరూ తీయలేదు. వీటిలో ఎక్కువభాగం యాంటీ ఎస్టాబ్లిష్‌మెంటుగా పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలుగా చూపాడు. ఇది యువతకు ఆదర్శం అయ్యింది. కమ్యూనిస్టులకు కూడా దారి ఏర్పరిచింది!
తాను సినిమా తీస్తున్నానని తెలిసీ నాగేశ్వరరావ్ ‘దేవదాస్’ రెండో సారి విడుదల చేశారు. కానీ కృష్ణ తీసిన దేవదాసే అద్భుతం అని పొగిడారు నాడు ఎల్వీ ప్రసాద్, చక్రపాణి లాంటివారు.
అయన చేసినన్ని మల్టీస్టారర్ సినిమాలు ఎవరూ చేయలేదు. స్క్రిప్టుతో వచ్చిన నిర్మాతల్ని ముందు ఎదుటి హీరోకి వినిపించి అతడు కోరుకున్న రోల్ అతడికిచ్చి, మిగిలిన రోల్ తనకిమ్మని అడిగేంత సాహసం అతడిది. 100 పైగా దర్శకులతో, 50 కి పైగా సంగీత దర్శకులతో, మల్టీస్టారర్లూ, త్రిపాత్రాభినయాలూ, ద్విపాత్రాభినయాలూ, రకరకాల ప్రయోగాలు చేసి, ఒకే సంవత్సరం 20 సినిమాల్లో నటించి, (18 రిలీజ్ అవ్వడం) సినిమాకు చెందిన అన్ని శాఖలు నిర్వహించిన అతడికి ‘దాదాసాహెబ్‌ఫాల్కే’ అవార్డు రాకపోవడం వి’చిత్రం’. నటుడిగా తాను చేసిన సినిమాలు ఆడకపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడమే కాదు, తనతో సినిమాలు చేసిన నిర్మాతలు కనపడకపోతే పిలిపించేవాడట. డబ్బులేక ఖాళీగా వున్నామని చెబితే తనె కాస్టింగ్ కూర్చి సినిమా తీసిపెట్టి మళ్లీ తేరుకునేలా చేసేవాడు. తనకు అవకాశం కల్పించిన ఆదుర్తి బ్లాక్ అండ్ వైట్‌లో గాజుల కిట్టయ్య సినిమా తీస్తుండగా పిలిపించి, తనే హీరోగా నటిస్తానని చెప్పి, కలర్‌లో తీయడానికి సహాయం చేశాడు. అతడి కొడుకుని తన కొడుకులా చూసుకున్నాడు.
నిర్మాతలిచ్చిన చెల్లని చెక్కులతో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయవచ్చనేది ఎవరో అన్నమాట కాదు, స్వయంగా ఆయనే అన్నారు. ఆయన సినిమాలను 48, 49 రోజులకే టాకీసుల నుండి మొహమాటం లేకుండా ఎత్తేయమనేవాడు రికార్డులకోసం చూడకుండా. ప్రజా అవసరాలకోసం విరాళాలు ప్రకటించడం అతడే నేర్పాడు సినిమా రంగానికి.
”ఎలాగోలా బతికేయడానికి ఇక్కడికి రాలేదు..” నిజమే ఆయన విస్తరించడమే కాకుండా పరిశ్రమకి జవాసత్వాలు అందించిన వన్ అండ్ ఓన్లీ హీరో.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834