ప్రవళిక ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం : దాసు సురేశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతామనే ప్రవళిక ఆత్మహత్య ఉదంతాన్ని ప్రభుత్వం తొక్కి పెడుతున్నదని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్‌ విమర్శించారు. ఆమె ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవళికది ప్రేమ వ్యవహారమనీ, గ్రూప్స్‌ పరీక్షలకు దరఖాస్తు చేయలేదన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు. ప్రభుత్వ అసమర్థతను ఒప్పుకోలేకనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సీబీఐ విచారణ కోసం త్వరలోనే హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబానికి సమాజం అండగా ఉండాలని కోరారు.