దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

– ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి అశోక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఓంకార్‌ భవన్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అశోక్‌ ఓంకార్‌ మాట్లాడుతూ దేశ సంపదను బడా కార్పొరేట్‌, సంపన్న వర్గాలకు కేంద్రం కట్టబెడుతున్నదని చెప్పారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని అన్నారు. కోర్టులు, పార్లమెంటు, ఈడీ, సీబీఐ, ఇతర చట్టబద్ధ సంస్థలను అక్రమంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నియంతృత్వ, కార్పొరేట్‌, మతోన్మాద సంస్థలు దేశంలో మతం పేరుతో ప్రజలను విభజించి రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. కమ్యూనిస్టు, వామపక్ష, ప్రగతిశీల, సామాజిక శక్తులన్నీ కార్పొరేట్‌ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించాలని కోరారు. వచ్చేనెలలో ఫూలే, అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పేదల సమస్యలపై అధ్యయనం చేసి మండల, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టేందుకు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఆ పార్టీ నాయకులు వంగాల రాగసుధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కార్యదర్శివర్గ సభ్యులు వల్లేపు ఉపేందర్‌రెడ్డి, వనం సుధాకర్‌, కుంభం సుకన్య, వడితీయ తుకారాం నాయక్‌, వసుకుల మట్టయ్య, పెద్దారపు రమేష్‌, ఎన్‌రెడ్డి హంసారెడ్డి, కన్నం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.