వినిపించని వేదన

ఎన్ని హృదయాలు దు:ఖంలో మునిగితేలుతున్నాయో..
ఎన్ని జీవితాలు ఆకలి కేకల మంటలలో కాలిపోతున్నాయో..!!

ఎక్కడో ఓ పిట్ట రాలిపోతున్న దృశ్యం
కళ్లెదుటే ఓ జీవితం రోడ్డు పక్కన అనాధలా
మిగిలిపోతున్న వైనం..!!

ఎంత చిత్ర విచిత్రమైనవో..
వినిపించని వేదనలో విలపించే దేహాలు..
కనిపించే శోకాలలో వినిపించే గాథలెన్నో…!!

కళ్ళున్నా చూడలేక ఆకాశాన్ని మిన్నంటే మౌనరోదనలు..
విధి రేపుతున్న గాయాలలో ఎదురీదలేక
అవి మౌనరోదనలుగా మదిని తాకుతున్న శాపాలు…!!

బతుకు సంగ్రామంలో
మాటల తూటలు గుండెల్లో గునపాలు గుచ్చుతున్నాయి..!!
మనుషుల్లో స్వార్థాలు.. రెప్పల్లో కన్నీరు
గుండెల్లో గాయాలు …
ఒకదానికొకటి ముడిపడుతూ
బ్రతుకు శిశిరానికి ఆనవాళ్లుగా మారుతున్నాయి..!!

జీవితం మీద యుద్ధం చేసి గెలవలేక
ఓడిపోయే ప్రతి మనిషి వెనక ..
ఓ వేదన కనిపించని
ఓ నివేదనగా మిగిలేవుంది..!!

గెలిచిన జీవితంలో కన్నీటి రాత్రులని
దాటుకొని నడిచొచ్చిన కథలన్నీ
మనసు పొరల్లో మాత్రం సజీవంగానే దాచబడ్డాయి…!!

– స్వప్న మేకల, 905222870