అంగన్వాడీ సమ్మెకు పలు పార్టీల మద్దతు

Anganwadi strike supported by many parties– బోనాలతో నిరసనలు, రాస్తారోకోలు
– మహబూబాబాద్‌ చలో కలెక్టరేట్‌ ఉద్రిక్తం
నవతెలంగాణ-విలేకరులు
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 16వ రోజుకు చేరుకున్నది. తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ జాయింట్‌ రాష్ట్ర కమిటీల (సీఐటీయూ, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి మహబూబాబాద్‌ వస్తున్న అంగన్‌వాడీలను అడ్డుకునేందుకు.. మరిపెడ, ఇల్లెందు, నర్సంపేట, కేసముద్రం, తొర్రూరు రహదారుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినా పోలీసులను తప్పించుకొని 500 మంది అంగన్‌వాడీలు మానుకోట తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్‌ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. దాంతో వారిమధ్య తోపులాట ఘర్షణ నెలకొంది. అయినా అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరగా.. బంధం కట్ట వద్దకు చేరుకోగానే.. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సమ్మెకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు సాదుల శ్రీనివాస్‌, బి.విజయ సారథి ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మహిళా కార్మికులను రోడ్డున పడేసిన ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపేందుకు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. ఉద్యోగులుగా గుర్తించకుండా పని చేసినంత కాలం గౌరవ వేతనంతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు.
సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించినా, సమ్మెలో ఉన్న యూనియన్‌లను తక్షణమే చర్చలకు పిలవక పోయినా అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు ఆకుల రాజు, కుంట ఉపేందర్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి.అజరు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు బుజ్జి దేవేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురనేని రాము, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు స్నేహబిందు, బి. సరోజ, చిరా లక్ష్మీనరసమ్మ, శైలజ నీలాదేవి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారంలో చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మెలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. వెంటనే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. శంషాబాద్‌లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వీరికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్‌ మద్దతు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగి పరిధిలోని బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అంగన్‌వాడీలు బోనాలతో నిరసన తెలిపారు. స్థానిక రాజీవ్‌ చౌక్‌ వద్ద మానవహారం చేశారు. సమ్మెకు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లయిన కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సౌకర్యాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. యాదాద్రిభువనగిరిలో భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, రామన్నపేట మండలకేంద్రాల్లో సమ్మె కొనసాగింది.