వినాయకునికి అంగన్‌వాడీల వినతి

Anganwadis' plea to Lord Ganesha– కొనసాగుతున్న సమ్మె
– తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట బైటాయింపు
– అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టిన అధికారులు
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అంగన్‌వాడీ కేంద్రాల ఉద్యోగులు, ఆయాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. మంగళవారం పలుచోట్ల వినాయకుడికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అధికారులు బలవంతంగా కేంద్రాలు తాళాలు పగులగొట్టి కార్యదర్శులకు అప్పగించారు. దీన్ని సీఐటీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూర్‌లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున బైటాయించారు. ఆమనగల్‌లో సమ్మెకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సుంకిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మద్దతు తెలిపారు. షాద్‌నగర్‌లో అంగన్‌వాడీలకు ఆశావర్కర్లు మద్దతు తెలిపారు. చేవెళ్లలో ఆర్టీసీ కార్గో ద్వారా కేంద్రాలకు తరలిస్తున్న సామాగ్రిని అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీ కార్మికులు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
సమ్మె కారణంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన ఆహారం లబ్దిదారులకు అందకుండా పాడవుతుందన్న సాకుతో ఐసీడీఎస్‌ అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో కేంద్రాల తాళాలు పగలగొట్టి తెరిపించారు. శంషాబాద్‌కు చెందిన అంగన్‌వాడీలు కందుకూరు వెళ్లడంతో సెక్టార్‌ సూపర్‌వైజర్‌ సుగుణ, శంషాబాద్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ భిక్షమమ్మ నర్కూడ కేంద్రానికి వచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద నోటీసులు అంటించారు. గ్రామ సర్పంచ్‌ సునిగంటి సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహ సమక్షంలో అంగన్‌వాడీ కేంద్రం తాళాలను కటింగ్‌ మిషన్‌తో విరగ్గొట్టారు. కేంద్రంలో ఉన్న ఆహారం, ఇతర సామాగ్రిని లెక్కించారు. అనంతరం అంగన్‌వాడీ సెక్టార్‌-2, సెక్టార్‌-3లో పంచాయతీలో కార్యదర్శి సమక్షంలో తాళాలు పగలగొట్టారు. అధికారులు కేంద్రాలకు వేరే తాళాలు వేసి పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. లబ్దిదారులకు ఆహారం పంపిణీ చేయాలని సూపర్‌వైజర్‌ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాళాలు పగలగొట్టి, సామాన్లు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించామని సూపర్‌వైజర్‌ సుగుణ తెలిపారు. అధికారుల వైఖరిని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేశ్‌ ఖండించారు.
భద్రాచలంలో వినాయక విగ్రహానికి సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆళ్లపల్లిలో మూతికి గుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు. పాల్వంచలో కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీలు పొర్లు దండాలు పెట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లు పట్టుకుని అంగన్‌వాడీలు బైటాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్‌.స్వామి, ఐద్వా జిల్లా కోశాధికారి ఆర్‌.మంజుల, అంగన్‌వాడీ యూనియన్‌ సీఐటీయూ నాయకులు, మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద భారీ మావహారంగా ఏర్పడ్డారు. దహెగాం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రెబ్బెన మండలంలో ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు.