అదానీ కంపెనీల్లో అజ్ఞాత పెట్టుబడులు

– మారిషస్‌ నుంచి రాబడులు
– డొల్లతనంపై మళ్లీ తీవ్ర అరోపణలు
– ఒసిసిఆర్‌పి రిపోర్ట్‌
– పడిపోయిన షేర్ల విలువ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల్లోని మోసాల డొల్లతనం మళ్లీ బయటపడింది. అదానీ అక్రమాలు, అవకతవకలపై ఇటీవల హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మర్చిపోకముందే మరో అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ (ఒసిసిఆర్‌పి) తాజాగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. పన్నులు తక్కువగా ఉండే పలు దేశాల్లోని పత్రాలు, అదానీ గ్రూప్‌ అంతర్గత ఇ-మెయిళ్లను తాము పరిశీలించింనట్లు ఒసిసిఆర్‌పి వెల్లడిం చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్‌ ఫండ్స్‌ ద్వారా పెట్టుబడులు పెడుతున్నారని తెలిపింది. అదానీ గ్రూపులోని ప్రమోటర్‌ కుటుంబంతో భాగస్వామ్యం ఉన్న పలువురు వ్యక్తులు వందల మిలియన్ల డాలర్లు (వేల కోట్ల రూపాయలు) అదానీ గ్రూప్‌ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారని స్పష్టం చేసింది. కృత్రిమంగా విలువ పెంచుతూ లబ్ది పొందుతున్నారని ఆరోపించింది. మారిషస్‌ కేంద్రంగా పని చేస్తున్న పలు అజ్ఞాత ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ద్వారా ఈ పెట్టుబడులు వస్తు న్నాయని వెల్లడించింది. అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఈ ఏడాది జనవరిలో ఇదే తరహా రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ”అనుమానాస్పద ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్లను విదేశీ ఫండ్ల ద్వారా క్రయవిక్రయాలు చేస్తున్నట్లు మా పరిశీలనలో గురించాము. నాసర్‌ అలీ షాబాన్‌ అహ్లీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు అదానీ కుటుంబంతో దీర్ఘకాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి చెందిన పలు కంపెనీల్లో వీరు డైరెక్టర్లుగా, వాటాదారులుగా కూడా వ్యవహారించారు. వీరు విదేశీ ఫండ్ల ద్వారా అదానీ గ్రూప్‌ షేర్లను క్రయ, విక్రయాలు చేస్తున్నారు. స్టాక్స్‌ ధరను కృత్రిమంగా పెంచి ఫలితంగా గణనీయంగా లాభాలను ఆర్జించారు. ” అని ఒసిసిఆర్‌పి తన రిపోర్ట్‌లో వెల్లడించింది. అహ్లీ, చాంగ్‌లు అదానీ గ్రూప్‌ ప్రమోటర్ల తరపున వ్యవహరిస్తున్నట్లు భావిస్తే.. ఆ గ్రూపు కంపెనీల్లోని ఇన్‌సైడర్లే 75 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్నట్లు అవుతుందని ఒసిసిఆర్‌పి పేర్కొంది. ఇది భారత లిస్టింగ్‌ కంపెనీల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అదానీ గ్రూపు స్టాక్స్‌ల్లో వారి కుటుంబ సభ్యుల సమన్వయంతోనే అహ్లీ, చాంగ్‌లు ట్రేడింగ్‌ జరిపారని తమ పరిశోధనలో ఆధారాలు లభించాయని తెలిపింది. 2013లో 8 బిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ.66వేల కోట్లు) ఉన్న అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌.. గతేడాదికి 260 బిలియన్లకు (దాదాపు రూ.21 లక్షల కోట్లు) చేరిందని వెల్లడించింది. ఒసిసిఆర్‌పిలో ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ జార్జ్‌ సోరోస్‌, రాక్‌ఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫండ్‌ వంటి వారికి పెట్టుబడులు ఉన్నాయి. అదానీ గ్రూపు తమ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుతోందని ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ రిపోర్ట్‌లో ఆరోపించింది. ఇది దేశంలో పెద్ద సంచలనం కావడంతో అదానీ గ్రూపు కంపెనీల స్టాక్స్‌ కుప్పకూలాయి. కాగా.. హిండెన్‌బర్గ్‌ అరోపణలను గతంలో జార్జ్‌ సోరోస్‌ సమర్థించారు. కాగా..ఒసిసిఆర్‌పి ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. తమపై చేసిన అరోపణలకు ఎలాంటి ఆధారాలే లేవని కొట్టిపారేసింది. అదానీ గ్రూపునపై వచ్చిన తాజా ఆరోపణలపై మార్కెట్‌ రెగ్యూలేటరీ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) విచారించనన్నట్లు తెలుస్తోంది.
అదానీ షేర్ల నేల చూపులు..
ఒసిసిఆర్‌పి రిపోర్ట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు గురువారం తీవ్ర ఒత్తిడికి గురైయ్యాయి. మార్కెట్ల ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అదాని గ్రూపులోని కీలక కంపెనీగా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెషన్‌ షేర్‌ బిఎస్‌ఇలో 3.77 శాతం పతనమై రూ.2,418.80కు పడిపోయింది. అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ విల్మర్‌ సూచీలు 2 శాతం నుంచి 4.3 శాతం మేర క్షీణించాయి. ఒసిసిఆర్‌పి రిపోర్ట్‌తో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు దాదాపు రూ.25వేల కోట్ల మేర నష్టాలు చవి చూశాయని అంచనా. ఇంతక్రితం జనవరిలోని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 50 శాతం పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఓ దశలో అదానీ టోటల్‌ గ్యాస్‌ 83 శాతం, అదాని ట్రాన్స్‌మిషన్‌ 73 శాతం, అదానీ టోటల్‌ గ్రీన్‌ 50 శాతం నష్టాలను చవి చూశాయి.