శ్రీరామ జ్యోతుల పేరుతో మరో కుట్ర

Another conspiracy in the name of Sri Rama Jyotula– మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోడీ కుయుక్తులు
– ఆరుగ్యారంటీలను తక్షణం అమలు చేయాలి
–  కేరళ తరహాలో రేషన్‌ కింద 14 రకాల వస్తువులివ్వాలి
–  ఐద్వా వర్క్‌ షాప్‌లో :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలకు మతం రంగు పులముతోందని అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ప్రతి ఇంటా శ్రీరామ జ్యోతులను వెలిగించి మరో దీపావళి పండుగలాగా చేయాలనే పిలుపు వెనుక బీజేపీ అధికారవాంఛ, కుట్రపూరిత వైఖరి దాగుందన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ అధ్యక్షతన ఖమ్మంలోని ఓ మామిడి తోటలో ఆదివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మల్లు లక్ష్మి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకు బస్సులను నడిపి మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కేరళ తరహాలో రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ను.. జనగణన అనంతరం చేస్తామని బీజేపీ ప్రకటించడం మహిళలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హింస, వేతన వ్యత్యాసాలు నిర్మూలించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉండాలని కోరారు. మహిళా సాధికారత సాధన, నిర్ణయాధికారం, ఆర్థిక వ్యవస్థలో మహిళలను భాగస్వాములను చేయాలన్నారు. ఇవన్నీ అమలు చేయకపోతే మహిళలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు పూనుకుందన్నారు. డార్విన్‌ పరిణామ క్రమాన్ని, చరిత్ర పాఠ్యాంశాలను, సైన్స్‌లోని పలు అంశాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యత్నించడం సబబు కాదని తెలిపారు. స్థానిక మహిళా సమస్యలను తెలుసుకొని, వాటి ప్రాతిపదికన అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వర్క్‌షాప్‌లో జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు రమణ, మెహరున్నీసా బేగం, పత్తిపాక నాగ సులోచన, పయ్యావుల ప్రభావతి, టి. కృష్ణవేణి, అమరావతి, అజిత, విజయ, బేబీ, కుమారి, బెల్లం లక్ష్మి, పకీరమ్మ తదితరులు పాల్గొన్నారు.