12న మరో వంద మహిళా ఆరోగ్య క్లినిక్స్‌

– 15నుంచి 9 మెడికల్‌ కళాశాలల్లో తరగతులు
–  ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
–  వైద్యకళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయండి : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఈనెల 12న మరో వంద మహిళ అరోగ్య క్లినిక్స్‌ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ క్లినిక్స్‌లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ, 8 రకాల ప్రధాన వైద్య సేవలు అందిస్తారనివైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఈ క్లినిక్స్‌ సంఖ్య రాష్ట్రంలో 272 నుంచి 372కి పెరుగుతుందని వివరించారు. అలాగే 5,204 స్టాఫ్‌ నర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంల పీఆర్సీ, పాత బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని మంత్రి టీ హరీశ్‌రావు అధికారుల్ని ఆదేశించారు. అలాగే ఈనెల 15వ తేదీ మరో 9 మెడికల్‌ కళాశాలల్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభిస్తారనీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ఏడాది కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం మెడికల్‌ కాలేజీలు కొత్తగా ప్రారంభమవుతున్నాయనీ, వాటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ సుధాకర్‌రావు, హెల్త్‌ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేష్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజరు కుమార్‌, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వైద్య విద్యను తెలంగాణ విద్యార్థులకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గతేడాది 8 కాలేజీలు ప్రారంభం కాగా, ఈనెల 15న మరో 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందనీ, కొత్తగా 900 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. దీనితో మొత్తం సీట్ల సంఖ్య 3,915కు పెరిగిందని చెప్పారు.
ప్రగతిభవన్లో మేఘాలయ సీఎం
రాష్ట్ర పర్యటనకు వచ్చిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంగ్మాను సీఎం కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించి, తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. ఇరువురు ముఖ్యమంత్రులు కొంతసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. తిరుగుప్రయాణమైన సంగ్మాకు సీఎం కేసీఆర్‌ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.