మరో అమ్మ

ఇప్పుడు నువ్వూ
నాకు మరో అమ్మవి..
ప్రేమ నీడను పంచే కొమ్మవి..
నా కథను మార్చి రాసిన బ్రహ్మవి..
అణువణువునా కరుణ నిండిన కాత్యాయనివి..
ఎక్కడా అచ్చు వేయబడని కావ్యానివి..

నా జీవితంలోకి ప్రేమ వరాన్ని తీసుకొచ్చిన
మా శుభ శతి కి రెండు మాటలు..

నిజానికి నువ్వు నాకు అందని ఆకాశానివి..
ఏ మథనం జరగకుండానే పాలకడలి పొంగి,
అమత కలశం అందినట్లు దొరికావ్‌..
చందమామని అందుకోబోయిన
నీ చేతివేళ్ల మరకలు
నింగి చుక్కలై మెరిసినపుడు,
నేనో తెల్లకాగితం..
నాలో చూడటానికి,
నా గురించి నీకు తెలియడానికి
ఇంకేం మిగల్లేదు..

నీ నవ్వుకై తపిస్తోన్న నన్ను
మేఘపు గోడల చాటున దాక్కుని చూస్తున్న
నీ మోము ఓ నెలవంక..

నా ఆరంభంలో..
నా ఓటమిలో..
నా చీకటిలో..
నా నవ్వు వెనుక కన్నీరై..
నా బాధ వెనుక సంతోషమై ఉన్న నీకు..
ప్రేమగా ఒక్కమాట..

నువ్వెంత దూరం నడుస్తావో
అంత దూరం నేనుంటా..
ఆకాశమై..
అనంతమై..
అన్నింటినీ మరిపించే నీ ఆరోప్రాణమై..

నీ ప్రేమలో నాకో కొత్త బ్రతుకు పరిమళాన్ని పరిచయం చేసిన
నా ఇంటి పట్టు పువ్వు కు
ప్రేమారా పుట్టిన రోజు శుభాకాంక్షలు..

– అగ్నిశిఖ