అశోకా వర్సిటీలో మరో ప్రొఫెసర్‌ రాజీనామా

– వైదొలిగిన బాలకృష్ణన్‌
– సవ్యసాచి దాస్‌కు సంఘీభావం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలోని ఆశోకా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ పులప్రే బాలకృష్ణన్‌ తన పదవికి రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం ఇదే యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త సవ్యసాచి దాస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సవ్యసాచి సమర్పించిన ఓ పరిశోధన పత్రం రాజకీయ దుమారాన్ని రేపింది. సవ్యసాచి దాస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాగా ఇప్పుడు రాజీనామా చేసిన బాలకృష్ణన్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోజికోడ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రపంచబ్యాంక్‌లలో వివిధ హోదాలలో పని చేశారు. అనేక ప్రఖ్యాతి గాంచిన పుస్తకాలు రాశారు. ఇటీ వలే ‘నెహ్రూ నుండి మోడీ వరకూ భారత ఆర్థిక వ్యవస్థ’ అనే పుస్తకాన్ని రచించారు.దీనిని 2022లో ప్రచురించారు. బాలకృష్ణన్‌ రాజీనామా చేసిన విషయాన్ని అశోకా యూనివర్సిటీ ఇంకా ధృవీకరించలేదు. ఆయన రాజీనామా లేఖ కూడా బహిర్గతం కాలేదు. అయితే సవ్యసాచి దాస్‌కు సంఘీభావంగానే బాలకృష్ణన్‌ రాజీనామా చేశారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. సవ్యసాచి రాజీనామా గురించి ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌ కథనాన్ని వెలువరించగానే రాజీనామాను ఆమోదించామని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ సోమక్‌ రేచౌదరి ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సవ్యసాచి ప్రచురించిన పరిశోధన పత్రంపై యూనివర్సిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అది తన ప్రతిష్టకు భంగకరంగా ఉండడంతో బీజేపీకి కూడా ఆగ్రహం కలిగించింది. సవ్యసాచి పరిశోధన పత్రంపై వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రేచౌదరి స్పందిస్తూ ‘అధ్యాపకులు తాము ఎంచుకున్న అంశంపై విద్యార్థులకు బోధించవచ్చు. పరిశోధనలు చేయవచ్చు. ఈ స్వేచ్ఛ సవ్యసాచికి కూడా వర్తిస్తుంది’ అని చెప్పారు. అయితే సవ్యసాచి, బాలకృష్ణన్‌ల రాజీనామాలతో మన దేశంలోని విద్యా వ్యవస్థలో స్వేచ్ఛ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నదో అర్థమవుతోంది.
సవ్యసాచి పరిశోధన ఏమిటి?
‘ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యం తిరోగమించింది’ అనే అంశంపై ఈ సంవత్సరం జూలై 25న సవ్యసాచి దాస్‌ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన అందులో వివరించారు. దీంతో ఆ పరిశోధన పత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనిపై యూనివర్సిటీ పెద్దలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో సవ్యసాచి తన పదవికి రాజీనామా చేశారు. సవ్యసాచి పరిశోధనకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని ఈ నెల 1న అధికారులు ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పనిచేసే బోధనా సిబ్బంది వివిధ అంశాలపై పరిశోధనలు చేసి, వాటిని ప్రచురించే ముందు ముసాయిదాలను వ్యాఖ్యలు, చర్చల కోసం మాధ్యమాలలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని అదే రంగంలో నిపుణులైన వారి సమీక్ష కోసం ప్రచురిస్తారు. పరిశోధన శాస్త్రీయంగా నాణ్యతతో కూడి ఉండేందుకు దానిని నిష్ణాతులు సమీక్షించడం అవసరం. సవ్యసాచి దాస్‌ పరిశోధన పత్రాన్ని సమీక్ష కోసం ప్రచురించలేదని, కాబట్టి దీనిలో నాణ్యత ప్రశ్నార్థకమని యూనివర్సిటీ వాదిస్తోంది. అయితే దాస్‌ పరిశోధనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని యూనివర్సిటీ చేసిన ప్రకటనపై దేశంలోనూ, విదేశాలలోనూ విద్యావేత్తలు విమర్శలు చేస్తున్నారు.2015లో సవ్యసాచి దాస్‌ను నియమించిన సందర్భంగా యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోనూ, విదేశాలలోనూ పేరెన్నికగన్న ఉత్తమ విద్యావేత్తలు, పండితుల చేరికతో ఈ ఏడాది తమ బోధనా సిబ్బంది సంఖ్య రెట్టింపు అయిందని గొప్పగా చెప్పుకుంది. ఇప్పుడు అదే యూనివర్సిటీ ఆయన పరిశోధనతో తనకు సంబంధం లేదంటూ తప్పించుకుంటోంది.