‘కోటా’లో మరో విద్యార్థి ఆత్మహత్య

– ఈ ఏడాదిలో 22వ ఘటన
జైపూర్‌ : ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌లోని గయకు చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగిద్‌గా మృతుడ్ని గుర్తించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి)లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్‌ పరీక్ష కోసం కోటాలోని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అతడు చదువుతున్నాడు. దీని కోసం గతేడాది నుంచి మహానగర్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే ప్రిపరేషన్‌ ఒత్తిడి వల్ల మంగళవారం రాత్రి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నది. ఈ నెలలో నలుగురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 సంఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింటి. అలాగే విద్యార్థులకు సహాయం కోసం ఒక హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేసింది.