ఆందోళన..ఆనందమాయె!

Anxiety..joy!– వాంఖడేలో మహ్మద్‌ షమి చారిత్రక ప్రదర్శన
– వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు
భారత్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌. ఐసీసీ టోర్నీ నాకౌట్లో మునుపెన్నడూ కివీస్‌పై నెగ్గని చరిత్ర. 398 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే దెబ్బతిన్నా కోలుకుంది న్యూజిలాండ్‌. కేన్‌ విలియమ్సన్‌, డార్లీ మిచెల్‌ స్కోరు ముందుకు నెడుతుండగా.. మ్యాచ్‌లో భారత్‌ వెనక్కి వెళ్తూ ఆందోళనలో పడింది. మరో 126 బంతుల్లో 210 పరుగులు చేయాల్సిన స్థితిలో కేన్‌ విలియమ్సన్‌ అందించిన క్యాచ్‌ను మిడ్‌ ఆన్‌లో మహ్మద్‌ షమి నేలపాలు చేశాడు. వాంఖడేలో 33000 మంది అభిమానులతో పాటు యావత్‌ దేశం ఒక్కసారిగా చప్పబడింది!. షమి క్యాచ్‌ను మ్యాచ్‌నే వదిలేశాడని అనుకున్నారు!. అభిమానులు, డ్రెస్సింగ్‌రూమ్‌, ఆటగాళ్ల ఆందోళన, అమోయమాన్ని ఆనందమయం చేసేందుకు మహ్మద్‌ షమికి ఎంతోసేపు పట్టలేదు.
నవతెలంగాణ క్రీడావిభాగం
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌. 29వ ఓవర్‌. జశ్‌ప్రీత్‌ బుమ్రా బౌలర్‌. బుమ్రా సంధించిన ఐదో బంతిని సరిగా అర్థం చేసుకోని కేన్‌ విలియమ్సన్‌ మిడ్‌ ఆన్‌లో బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌ను అందుకునేందుకు మహ్మద్‌ షమి సిద్ధమైనా.. అది పట్టు చిక్కక చేజారింది. విలియమ్సన్‌ క్యాచ్‌ నేలపాలు కావటం జశ్‌ప్రీత్‌ బుమ్రా చూడలేకపోయాడు. రెండు చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకుని భావోద్వేగాలను అణచుకున్నాడు. స్టేడియంలోని 33000 మంది అభిమానులు, టెలివిజన్‌, డిజిటల్‌ తెరలపై మ్యాచ్‌ను వీక్షించే వారి పరిస్థితి సైతం అటువంటిదే. పది బంతుల వ్యవధిలో న్యూజిలాండ్‌ ఓపెనర్లను అవుట్‌ చేసిన మహ్మద్‌ షమి భారత్‌ను రేసులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కీలక సమయంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. టీమ్‌ ఇండియా ఈ క్యాచ్‌తో వదిలేసి ఫైనల్‌ బెర్త్‌ను వదిలేసిందా? అనే ఆందోళన, అయోమయం అభిమానుల్లో, ఆటగాళ్లలో, డ్రెస్సింగ్‌రూమ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది.
అనూహ్య తడబాటు!
2023 ఐసీసీ ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా జైత్రయాత్ర సాగింది. తొమ్మిది మ్యాచుల గ్రూప్‌ దశలో ఓ తరహా దండయాత్ర చేసింది. దేశవ్యాప్తంగా మ్యాచులు ఆడిన టీమ్‌ ఇండియా ప్రత్యర్థి, నగరాలు మారినా.. ఫలితం, ప్రదర్శన మాత్రం పునరావృతం చేసింది. వాంఖడేలో సెమీఫైనల్లో తొలుత 397 పరుగులు చేయటంతో ప్రపంచకప్‌ నాకౌట్‌ సైతం జైత్రయాత్రలో భాగమైందనే భావన కనిపించింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో గ్రూప్‌ మ్యాచ్‌లో ఆరంభంలో టాప్‌ ఆర్డర్‌ నిష్క్రమించిన తర్వాత టీమ్‌ ఇండియా తొలిసారి ఓటమి భయం ఎరిగింది వాంఖడేలోనే. కానీ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆరంభంలోనే ఓపెనర్లను అవుట్‌ చేసిన మహ్మద్‌ షమి మ్యాచ్‌ను లాగేశాడు. కానీ డార్లీ మిచెల్‌, కేన్‌ విలియమ్సన్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. బంతి స్వింగ్‌ అయ్యే దశను దాటుకుని స్వేచ్ఛగా పరుగులు చేసే స్థితికి చేరారు. దీంతో నాకౌట్‌ మ్యాచ్‌లో కివీస్‌ను దెబ్బకొట్టే శక్తి కోసం టీమ్‌ ఇండియా ఎదురుచూసింది. కివీస్‌తో సెమీస్‌ పోరులో టీమ్‌ ఇండియా తడబాటుకు గురైంది. రవీంద్ర జడేజా గీత (నోబాల్‌) దాటాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫీల్డింగ్‌లో తడబడ్డాడు. వికెట్ల వెనకాల కెఎల్‌ రాహుల్‌ వైడ్లకు అదనంగా బౌండరీలు కోల్పోయాడు. విలియమ్సన్‌ను రనౌట్‌ చేసే అవకాశం రాహుల్‌ వృథా చేశాడు. షమి త్రో చేసిన బంతిని అందుకునేందుకు ముందే గ్లౌవ్స్‌తో వికెట్లను తాకాడు. విలియమ్సన్‌ తొలిసారి జీవనదానం ఇక్కడే పొందాడు. గ్రూప్‌ దశలో ఎక్కడా చిన్న పొరపాటుకు చోటివ్వని టీమ్‌ ఇండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ ఒత్తిడికి కాస్త తలొంచింది. ఇదే సమయంలో కేన్‌ విలియమ్సన్‌ కుల్దీప్‌ యాదవ్‌ను టార్గెట్‌ చేయగా.. షమి, జడేజా ఓవర్లో డార్లీ మిచెల్‌ ఏకంగా నాలుగు సిక్సర్లు స్ట్రయిట్‌గా బాదాడు. రెండో స్పెల్‌లో బంతి అందుకున్న బుమ్రా ఐదో బంతికి విలియమ్సన్‌ ఓ తప్పు చేసేలా చేశాడు బుమ్రా. కానీ షమి అనూహ్యంగా ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ‘విపరీత బాధ’ గురయ్యానని మ్యాచ్‌ అనంతరం షమి ఆ క్యాచ్‌పై మనసులో మాట చెప్పగా.. నిజానికి ఆ క్యాచ్‌ నేలపాలు కావటంతో టీమ్‌ ఇండియా స్వయంకృతంతో ఓటమి దిశగా పయనిస్తోందా? అనిపించింది. తను చేసిన తప్పిదం మరో మూడు ఓవర్ల పాటు అనుభవించాడు!. ఈ సమయంలో విలియమ్సన్‌.. కుల్దీప్‌ను స్లాగ్‌ స్వీప్‌, బుమ్రాను లాంగ్‌ లెగ్‌లో బౌండరీలు బాదాడు. డార్లీ మిచెల్‌.. రివర్స్‌ స్వీప్‌, లాంగ్‌ ఆఫ్‌, ఫైన్‌ లెగ్‌లో పరుగులు రాబట్టాడు. ఆ క్యాచ్‌ నుంచి కథ కివీస్‌కు అనుకూలంగా సాగటం మొదలైంది.
అద్వితీయ కమ్‌బ్యాక్‌
108 బంతుల్లో 179 పరుగులు. మహ్మద్‌ షమి రెండో స్పెల్‌లో బంతి అందుకునే సమయానికి ఛేదనలో న్యూజిలాండ్‌ సమీకరణం. టీ20 యుగం, చేతిలో వికెట్లు ఇదేమంత అసాధ్యం కాదు. కానీ షమి మరో కండ్లుచెదిరే ఓవర్‌తో ఏకంగా కివీస్‌ కథకే ముగింపు పలికాడు. విలియమ్సన్‌కు స్లాట్‌ బాల్‌ను సంధించి ఊరించాడు షమి. విలియమ్సన్‌ బంతిని డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్‌ లెగ్‌లో ఆడగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ చక్కగా క్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. సుమారు 90 నిమిషాల నిశ్శబ్దం నుంచి స్టేడియం మళ్లీ జీవం పూసుకోగా.. డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం సైతం తేలికపడింది. అదే ఓవర్లో కొత్త బ్యాటర్‌ టామ్‌ లేథమ్‌ను డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్రను అవుట్‌ చేసిన స్టయిల్‌లో పెవిలియన్‌కు చేర్చాడు. మహ్మద్‌ షమి దెబ్బకు 220/2తో బలంగా కనిపించిన న్యూజిలాండ్‌ ఒక్కసారిగా 220/4తో డీలా పడింది. ఇక అక్కడ్నుంచి జరిగింది అంతా లాంఛనమే. డార్లీ మిచెల్‌ శతకంతో పోరాడినా.. ఓటమి అంతరం కుదించడానికే. చివర్లో మళ్లీ బంతి అందుకున్న షమి మరో మూడు వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏడు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 17 మ్యాచుల్లోనే 54 వికెట్లు కూల్చిన మహ్మద్‌ షమి ప్రపంచకప్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్‌గా నిలిచాడు!. వరల్డ్‌కప్‌లో షమి నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఈ ప్రపంచకప్‌లోనే ఏకంగా మూడుసార్లు ఐదేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు మహ్మద్‌ షమి సింహస్వప్నం అయ్యాడు. లెఫ్ట్‌ హ్యాండర్లకు షమి 52 బంతులు వేయగా.. అందులో 51 బంతులు అరౌండ్‌ ద వికెట్‌ నుంచి విసిరాడు. లెఫ్ట్‌ హ్యాండర్లపై షమి సగటు 4. క్రీజుకు ఆవలగా బంతిని సంధించే షమి ఆడలేని కోణంలో బంతిని ప్రయోగిస్తున్నాడు. షమి సహజ లెంగ్త్‌తో కట్‌, ఫుల్‌ షాట్‌ ఆడేందుకు సైతం కష్టమే. డ్రైవ్‌ చేసేందుకు మరీ షార్ట్‌ అవుతుంది. ఇక వికెట్‌కు ఇరువైపుల ఎటువంటి స్వింగ్‌ లభించినా.. ఇక బ్యాటర్లకు మరిన్ని చిక్కులు తప్పవు.
ఎదురులేని షమి
రెండేండ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో పేలవ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ఆన్‌లైన్‌లో అతివాదుల ద్వేషానికి గురయ్యాడు. విరాట్‌ కోహ్లి ఆ సమయంలో మహ్మద్‌ షమికి అండగా నిలబడ్డాడు. సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. స్వదేశంలో 2023 ఐసీసీ ప్రపంచకప్‌ ఆరంభ దశలో జట్టు సమతుల్యం కోసం మహ్మద్‌ షమి బెంచ్‌కు పరిమితం అయ్యాడు. హార్దిక్‌ పాండ్య గాయంతో దూరమవగా గ్రూప్‌ దశలో ఐదో మ్యాచ్‌ నుంచి తుది జట్టులో ఆడుతున్నాడు. ఆరు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ షమి.. అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా ప్రపంచకప్‌ ఫైనల్‌ వేదిక అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. 9.13 సగటు, 5.01 ఎకానమీ, 10.91 స్ట్రయిక్‌రేట్‌తో ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న మహ్మద్‌ షమికి ఎవరూ సరిలేరు!. ఇటు టీమ్‌ ఇండియా జైత్రయాత్ర, అటు మహ్మద్‌ షమి వికెట్ల జాతర.. ఐసీసీ ట్రోఫీ వేటలో భారత జట్టు 12 ఏండ్ల నిరీక్షణకు ఆదివారం అహ్మదాబాద్‌లో ప్రపంచకప్‌ విజయంతో ఘనంగా తెరపడనుంది!.