భార్యంటే తాము చెప్పిందే వినాలని చాలా మంది మగవారి భావన. అది మంచైనా చెడైనా సంబంధం లేదు. తమ మాటే నెగ్గాలంటారు. కానీ ఇలాంటి ఆధిపత్యం ఎక్కువ కాలం సాగదని అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇలాంటి ధోరణి వల్లనే ఇటీవల చాలా జంటలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. భార్యమాటలను తాము కూడా గౌరవించాలనే విషయం మరిచిపోతున్నారు. పెద్దలు కూడా పురుషాధిక్య సమాజంలో ఇది సాధారణం అనుకొని వదిలేస్తున్నారు. కానీ నేడు పరిస్థితులు మరాయి. ఒకరికి ఒకరు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రేమతో అర్థం చేసుకుంటేనే సంసారం హాయిగా సాగిపోతుంది. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
లావణ్యకు ప్రస్తుతం 30 ఏండ్లు ఉంటాయి. నవీన్‌కు 35 ఏండ్లు. వీరిద్దరికీ ఎనిమిదేండ్ల కిందట పెండ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరూ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. నాలుగేండ్లు ఉంటాయి. ఇద్దరూ సిటీలోనే ఉంటున్నారు. లావణ్య ఉద్యోగం చేయడం నవీన్‌కు ఇష్టం లేదు. ‘నాకు వచ్చే జీతం సరిపోతుంది కదా! ఇంక నువ్వెందుకు ఉద్యోగం చేయడం. ఇంట్లో కూర్చొని హాయిగా బాబును చూసుకోవచ్చు కదా! ఇప్పటికే వయసు అయిపోతుంది. ఇంకో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుందాం’ అంటాడు అతను. ‘రెండో బిడ్డ కోసం ప్లాన్ చేసుకోవడానికి, నా ఉద్యోగానికి ఏమిటి సంబంధం. ఆరు నెలలు, లేదా ఏడాది బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది కదా’ అని ఆమె సమాధానం.
‘నేను పీజీ వరకు చదువుకున్నాను. ఇంత చదువుకుని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను. నన్ను నేను నిరూపించుకోవడానికైనా ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం చేస్తే నవీన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నాకు నచ్చింది నేను కొనుక్కోవచ్చు. నాకు నచ్చినట్లుగా నేను ఉండొచ్చు. ఉద్యోగం చేయకపోతే ప్రతి చిన్న విషయానికి నవీన్‌పై ఆధారపడాల్సి వస్తుంది’ అని ఆమె ఆలోచన. ఈమె ఇలా ఆలోచించడానికి కారణాలు లేకపోలేదు. బాబు పుట్టినప్పుడు ఆమె రెండేండ్లు ఉద్యోగం చేయలేదు. అప్పుడు నవీన్ డబ్బులు ఇచ్చినా ప్రతి రూపాయికీ లెక్కలు అడిగేవాడు. బాబు పాల కోసం ఖర్చు పెట్టినా ‘పాల కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా’ అనేవాడు. అందుకే ఆమెకు తనకంటూ సొంత సంపాదన ఉండాలనే ఆలోచన వచ్చింది. ‘అదే నేను ఉద్యోగం చేస్తే కుటుంబ భారం మొత్తం నవీన్‌పై పడదు. పైగా ఇద్దరూ సంపాదిస్తే మిగిలిన డబ్బు సేవింగ్ చేయవచ్చు. ఆ డబ్బు భవిష్యత్‌లో ఇల్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది’ అంటుంది.
కానీ లావణ్య మాటలను నవీన్ పట్టించుకోడు. పైగా ‘నువ్వు నా మాట వినడం లేదు. నా మాట వినేవారితోనే నేను ఉంటాను’ అంటూ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటీ అని ఆమె ప్రశ్నిస్తే ‘నేనేం చెప్పినా వినే అమ్మాయి కావాలి. అంతేకానీ ప్రతి విషయానికి నాకు ఎదురు చెప్పే భార్య నాకు అవసరం లేదు. అందుకే నా మాట వినే అమ్మాయిని చూసి ఆమెతోనే ఉంటాను’ అని వెళ్ళిపోయాడు.
పైగా వాళ్ళ బంధువులందరితో ‘లావణ్య మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుందామంటే నా మాట వినడం లేదు. నన్ను దగ్గరకు కూడా రానీయడం లేదు. అందుకే వేరే అమ్మాయితో ఉంటున్నాను’ అని చెప్పుకుంటున్నాడు. అందరూ అతని మాటలే నిజమని నమ్మి లావణ్యను తిట్టడం మొదలుపెట్టారు. చివరకు లావణ్య తల్లిదండ్రులు కూడా ఆమెనే తప్పు పట్టారు. అలాంటి పరిస్థితుల్లో లావణ్య సలహా కోసం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)కు వచ్చింది.
ఆమె చెప్పింది మొత్తం విని మేము నవీన్‌ని పిలిపించి మాట్లాడాము. మాతో కూడా ‘లావణ్య నన్ను దగ్గరకు రానీయడం లేదు. అందుకే నేను వేరే అమ్మాయితో ఉంటున్నాను. ఇందులో తప్పేముంది. నిజానికి తను నా దగ్గరకు రాకుండా నన్ను ఇబ్బంది పెడుతుంది. నేనే ఆమెపైన కేసు పెట్టాలి. ఆ హక్కు నాకుంది’ అన్నాడు. దానికి మేము ‘సరే అలాగే చేయండి. ఆమె ఎన్ని రోజుల నుండి మిమ్మల్ని దూరం పెడుతుంది. మీరు ఎన్ని రోజుల నుండి వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నారో అన్నీ బయటకు వస్తాయి. మీకు మరో విషయం తెలుసో లేదో… భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా, భార్యకు ఇష్టం లేకుండా బలవంతం చేసినా, లైంగిక చర్యకు పాల్పడినా మీపై కేసు పెట్టే హక్కు ఆమెకు కూడా ఉంటుంది. కాబట్టి తన హక్కును తాను ఉపయోగించుకొని మీపై కేసు పెడుతుంది’ అనే సరికి కాస్త తగ్గాడు.
‘మేడం… ఆమె ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఉండి పిల్లవాడిని చూసుకోవచ్చు కదా! అలాగే ఇంకో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుందాం అంటే వినడం లేదు. ఆమె ఉద్యోగం చేయకపోయినా నాకు వచ్చే డబ్బుతో ఒక ప్లాట్ కూడా తీసుకున్నాను. దానికి నెల నెల ఈఎంఐ కడుతున్నాను. మరో నాలుగేండ్లలో అది అయిపోతుంది. ఆ తర్వాత సొంత ఇల్లు కూడా తీసుకుంటాను. ఆమె ఉద్యోగం చేయాల్సిన పనే లేదు. అలాంటప్పుడు ఎందుకు అంత మొండిగా ఉద్యోగం చేస్తుంది? భార్య నా మాట లెక్క చేయకపోతే నాకు ఎలా ఉంటుంది’ అన్నాడు.
దానికి లావణ్య ‘నేను ఉద్యోగం చేస్లే వచ్చే నష్టం ఏంటో అర్థం కావడం లేదు. నేనేమీ లేట్ నైట్ వరకు ఆఫీసులో ఉండను. 9 గంటలకు వెళ్ళి 5 గంటల కల్లా వచ్చేస్తాను. ఆదివారాలు, పండగలు, ప్రభుత్వ సెలవలు అన్నీ నాకూ వర్తిస్తాయి. బాబును స్కూల్‌కి పంపించిన తర్వాతే ఆఫీస్‌కి వెళతాను. తిరిగి వచ్చే సరికి నేను ఇంట్లోనే ఉంటాను. అయినా నవీన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకో బిడ్డ కోసమే అయితే నాకూ మరో బిడ్డను కనాలనే ఉంది. కానీ నవీన్ నాతో కాకుండా వేరే ఆమెతో ఉంటుంటే నాకు బిడ్డ ఎలా పుడతాడో నాకైతే అర్థం కావడం లేదు. ఆమెతో సంబంధ పెట్టుకుంటే నేను మాత్రం నవీన్‌తో కలిసి ఉండను. నా దారి నేను చూసుకుంటాను. నేను మాత్రం ఉద్యోగం మానే ప్రసక్తే లేదు. తర్వాత ఆయన ఇష్టం’ అని కచ్చితంగా చెప్పేసింది.
దానికి మేము ‘చూడు నవీన్ నీ మాటలు వింటుంటే అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం ఉండకూడదు అన్నట్టుగా ఉన్నాయి. కానీ నీ ఆలోచన తప్పు. భార్యంటే భర్త చెప్పినట్టు నడుచుకోవాలి అంటున్నావు. మరి నువ్వు కూడా ఆమె మాట వినాలి కదా! ఏది ఏమైనా భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌవరించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒకరి పెత్తనమే నడవాలంటే ఎక్కువ రోజులు కలిసి బతకలేరు. ఆమె ఉద్యోగం చేయడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటీ. అనవసరంగా లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నావు. దీని వల్ల నష్టపోయేది నువ్వే. బాగా ఆలోచించుకో. ఈగోలకు పోకుండా ప్రశాంతంగా ఆలోచించు. నీ భవిష్యత్తు, నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది’ అన్నాము.
బాగా ఆలోచించి ఇక చేసేది లేక నవీన్ లావణ్య చెప్పిన దానికి అంగీకరించాడు. వేరే అమ్మాయిని వదిలిపెట్టి లావణ్యతో కలిసి ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. లావణ్య హాయిగా తనకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటోంది. ఈ మధ్యనే లావణ్య పేరు మీద సొంత ఇల్లు కూడా కొనుక్కొన్నారు.
– వై వరలక్ష్మి, 9948794051