ఆ రెండూ కాకుండా నేను రాజకీయ నాయకుడినయ్యా!

Apart from those two I became a politician!– అమ్మకు డాక్టర్‌ కావాలని.. నాన్నకు ఐఏఎస్‌ కావాలని కోరిక.
– రాజన్నసిరిసిల్ల జిల్లా మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్‌ / కరీంనగర్‌ / కొత్తపల్లి
‘1993లో నేను బయాలజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎంసెట్‌ రాస్తే 1600 ర్యాంకు వచ్చింది.. అయినా మెడిసిన్‌ సీట్‌ రాలేదు. మా అమ్మకు నేను డాక్టర్‌ కావాలని, నాన్నకు ఐఏఎస్‌ కావాలనే కోరిక ఉండేది. ఆ రెండూ కాకుండా నేను రాజకీయ నాయకుడిని అయ్యాను’ అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం మెడికల్‌ కాలేజీని రాజధాని నుంచే సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేదికలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కళాశాలల్లో ప్రతి సంవత్సరమూ 10వేల మంది విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్లుగా బయటకు వస్తున్నారని చెప్పారు. దేవుని రూపంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడే వైద్యున్ని ప్రజలు గౌరవిస్తారని, అంతటి ప్రాధాన్యతన ఉన్నదే వైద్య వృత్తి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించి ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీని ప్రారంభించి పేదలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, సెస్‌ చైర్మెన్‌ చిక్కాల రామారావు, రాష్ట్ర పవర్‌ లూం, టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌, టెస్కాబ్‌ చైర్మెన్‌ కొండూరి రవీందర్‌, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్‌లు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
‘దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర శివారులోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ తాత్కాలిక భవనాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడారు. గతంలో వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పిన్స్‌ తదితర దేశాలకు వెళ్లి చదివేవారని గుర్తు చేశారు. గతంలో 5 వైద్య కళాశాలలు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అంతకుముందు రేకుర్తి బ్రిడ్జి వద్ద మంత్రి జెండా ఊపి విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, కలెక్టర్‌ బి.గోపి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌ సుంకే రవిశంకర్‌ పాల్గొన్నారు.