బాసర త్రిపుల్‌ఐటీ ప్రవేశాల దరఖాస్తు గడువు 22 వరకు పొడిగింపు

– ఆర్జీయూకేటీ బాసర వీసీ వెంకటరమణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) బాసర త్రిపుల్‌ఐటీలో 2023-24 విద్యాసంవత్సరంలో ఆరేండ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆర్జీయూకేటీ ఉపకులపతి (వీసీ) వి వెంకటరమణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారంతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ గడువును ఈనెల 22 వరకు పొడిగించామని పేర్కొన్నారు. వికలాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, క్రీడాకారులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 27 వరకు అవకాశముందని తెలిపారు. ఆర్జీయూకేటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను వచ్చేనెల మూడో తేదీన విడుదల చేస్తామని వివరించారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ విద్యార్థులకు రూ.1,500, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు వంద డాలర్లు చెల్లించాలని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండకుండా ఉన్న వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు మూడేండ్లు మినహాయింపు ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు షషష.తీస్త్రబస్‌.aష.ఱఅ, షషష.aసఎఱరరఱశీఅర.తీస్త్రబస్‌.aష.ఱఅ వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.