పిల్లలకు తెలుసుకొనే అవకాశం ఇస్తున్నామా?

Are we giving children a chance to learn?నా హబ్బీ (డా||హిప్నో కమలాకర్‌) నేను చెప్పుల దుకాణంకి వెళ్ళాం. నా శ్రీవారు షూ చూస్తుంటే… నేను చెప్పులు చూస్తున్నా. అప్పుడే దుకాణంలోకి ఒక ఆవిడ వస్తూనే తన నాలుగేళ్ల పాపను… ఇదిగో ఈ రోజు నేను చెప్పిన చెప్పులు తీసుకోకపోతే చంపేస్తా అని తిడుతూ బరబరా లోపలికి లాక్కోచ్చింది. వాళ్ళ ఆయన అనుకుంటా.. అబ్బా దానిని బయపెట్టకే. అది సంవత్సరం నుంచి చెప్పులు వేసుకోవడం లేదు అని అనగానే… ఆవిడ ఇదిగో మీరు నోరు మూసుకుంటారా అంది. నేను ఆశక్తిగా వారి వైపు చూస్తుండగా…. ఇంతలో పాప నాకు నడిచే చెప్పులే కావాలి అని గట్టిగా ఏడుస్తుంది. ఆవిడ ఆ పాపని టపీమని నాలుగు పీకింది. ఆ పాప రాగం మరింత పెంచింది.
నాలో ఇంకా ఆశక్తి పెరిగి ఆవిడను అడిగా. ఏమని చెప్పను ఆ దిక్కు మాలిన టివి.. అందులో యాడ్స్‌ చూసి అటువంటి చెప్పులే కావాలి అని సంవత్సరం నుంచి చెప్పులు వేసుకోవడం లేదని ఏడుపు మొఖంతో చెప్పింది. ఏమిటా యాడ్‌ అనగానే… అటూ ఇటూ చూస్తూ అదేనండీ పిరియడ్‌ టైం లో పెట్టుకుంటారు కదా ఆ యాడ్‌ అని చెప్పింది. ముందు నాకు అర్ధం కాలేదు. కాసేపటికి నా బల్బు వెలిగింది. పాపను పిలిచి నీకు ఆ చెప్పులే కావాలా అని అడిగాను. అవును అంది. పాప వాళ్ళ అమ్మ చేతిలో ఇంకో బేబీ ఉంటే నేను తీసుకోని…నీ తమ్ముడు పాస్‌ పోసినా, దొడ్డి కి వెళ్లినా తడవకుండా ఈ పాడ్స్‌ పెడతారు చూడు అని చూపించగా….ఆ పాప చీ ఇదా? అది అయితే నాకు వద్దు అని తనకు నచ్చిన చెప్పులు తీసుకుని ఆనందంగా వేసుకుంది. ఆ పాప తల్లి ఆప్యాయంగా నాచెయ్యి పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు.
బాగా ఎండలు వున్న టైంలో మా మేనకోడలు నాలుగేళ్ల సహస్ర బయటకు వెళ్తుంది. మా నాన్న కాళ్ళు కాలిపోతాయి వెళ్ళకు అని చెప్పినా వినకుండా చెప్పులు లేకుండా వెళ్లింది. వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి ఏడుస్తూ వచ్చింది. నేను చెపితే విన్నావా అని నాన్న నవ్వుతూ అంటే ఇంకా గట్టిగా ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి పోయింది. మర్నాడు మా నాన్న బయటకు వెళుతుంటే తాతా ఆగు అని చెప్పులు తీసుకొచ్చి వేసుకో లేకపోతే కాళ్ళు కాలిపోతాయి అని చెపుతుంది.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని బంగారు పంజరంలో పక్షుల్లా పెంచుతూ తెలుసుకోనే అవకాశం ఇవ్వడంలేదు. ఇలా వుండు, అలా ఉండు, అది చేయకు, ఇది ముట్టుకోకు, ఇలా మాట్లాడు, అలా మాట్లాడకూ, అక్కడికి వెళ్లు, ఇక్కడకు వెళ్ళకూ… అని ఎన్నో ఆంక్షలు విధించి, వాళ్లలో తెలుసు కోవాలి, నేర్చు కోవాలి అనే ఆసక్తి నీ చంపెస్తున్నాం. జీవచ్ఛవంలా బతికే లా తయారు చేస్తున్నాం.
పిల్లలకి అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా వుంటుంది. ఆంక్షలు పెట్టి, బంధించడం వల్ల ఏమి నేర్చుకోలేక మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. జీవితంలో విజయం సాధించడానికి ప్రతి బిడ్డకు అవకాశం ఇవ్వండి.
జీవితంలో ఆనందాలు, కష్టాలు తెలుసుకునేలా వారి ఆలోచనలకు రూపం ఇచ్చి, అవరోథాలు దాటడమే కర్తవ్యం అని తెలుసుకునేలా పిల్లలకు అవకాశం ఇవ్వాలి.
కాలం మారుతోంది దానికి తగిన విధంగా విషయ పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించాలి. విజ్ఞానం, సైన్స్‌, గౌరవం, సంస్కృతి, నైతిక విలువలు, సంప్రదాయాల పట్ల మక్కువ కల్పించాలి. పిల్లలు మన జాతి సంపద. సున్నితమైన, లేత మనసులు కల పిల్లలకు అన్ని వనరులు కల్పించవలసిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిదీ. వారిని స్వేచ్ఛగా బతకనివ్వాలి. అప్పుడే పిల్లల్లో చిరునవ్వులు పూయించగలం..
అమ్మలా అమృతాన్ని పంచే గోరు ముద్దలు…
నాన్న అప్యాయతను పలికించే పలుకులు…
నాన్నమ్మ, అమమ్మల ముద్దులు. తాతయ్య గారాలు… అక్క, అన్నయ్యలతో గిల్లి కజ్జాలు… అలిగితే బుజ్జగింపులు, ఏడిస్తే ఊరడింపులు పిల్లలకు అందించాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపీస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌