– మాకు ఉచిత చీరలు అవసరం లేదు
– ఉద్యోగాలు, నీటి వసతులు కల్పించండి
– గ్రామంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు
– చీరలను వాపస్ చేసిన పాల్ఘర్ గిరిజన మహిళలు
– మహారాష్ట్రలో ప్రభుత్వానికి షాక్
ముంబయి : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గల గిరిజన మహిళలు తమ గ్రామంలో కనీస వసతుల కోసం ఉద్యమించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన చీరలను వాపస్ చేశారు. ఊహించని ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వాన్ని షాక్‌కు గురి చేసింది. సౌకర్యాలు, ఉద్యోగాలు కల్పించటం బంద్‌జేసి ఇలా ఉచిత చీరలు ఇవ్వటమేమిటని సదరు గిరిజన మహిళలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ”మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేమే ఈ చీరలు కొనుక్కునేవాళ్లం. మాకు చీరలు ఇవ్వడానికి మీరెవరు? మేం మీ భార్యలమా మాకు చీరలు అక్కర్లేదు. మాకు పని కావాలి. అని మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని గిరిజన కుగ్రామానికి చెందిన లడ్కుబాయి (52) అన్నారు.
వసంత్‌వాడి గిరిజన గ్రామంలో దాదాపు 250 కుటుంబాలుంటాయి. అయితే, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ గ్రామంలోని వారు, ముఖ్యంగా మహిళలు తిరుగుబాటును చేపట్టారు. ‘ఉద్యోగాలు ఇవ్వండి. దాంతో మేము మా చీరలను కొనుగోలు చేస్తాము’ అని మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గిరిజన మహిళలు ప్రాథమిక సౌకర్యాల కోసం డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబయికి 120 కి.మీ దూరంలో ఉన్న గ్రామం లోపల పగిలిపోయిన రోడ్లు, తాత్కాలిక గృహాలు, చేతిపంపుల వద్ద నీటి కోసం మహిళల కష్టాలు కనిపిస్తాయి.
ఎన్నికలను ప్రకటించి.. మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) అమల్లోకి రావటానికి కొన్ని రోజుల ముందు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద ఉచిత ఆహార ధాన్యాలను పొందేందుకు వెళ్లిన సమయంలో అనేక గ్రామాల ప్రజలకు స్థానిక రేషన్ అవుట్‌లెట్లలో సంచులు, చీరలను ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద మహిళలకు ఈ చీరలను ఇచ్చారు. గత ఏడాది నవంబర్‌లో, మహారాష్ట్ర ప్రభుత్వం 2028 వరకు ప్రతి సంవత్సరం ‘అంత్యోదయ’ రేషన్ కార్డులను కలిగి ఉన్న మహిళలకు ఉచితంగా చీరలను అందించే పథకాన్ని ప్రారంభించింది.
ఏప్రిల్ 3, 8 తేదీలలో, పాల్ఘర్‌లోని 23 గ్రామాలకు చెందిన అనేక మంది గిరిజన మహిళలు జవహర్, దహను తహసీల్దార్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి ఉచిత చీరలు, బ్యాగులు తిరిగి ఇచ్చారు.” మాకు ఉచితాలు ఇవ్వకండి. మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మంచి పాఠశాలలు, మెరుగైన రోడ్లు, వైద్యం కల్పించండి” అనేది వారి ఉద్యమ సందేశమని తెలిపారు. ”నీటి సరఫరా లేదు. ఉద్యోగాలు లేవు. ఉచిత చీరలతో మేం ఏమి చేస్తాము?” అని అక్కడి మహిళలు ప్రశ్నించారు. ”మాకు ఈ చీరలు, బ్యాగులు వద్దు.. నీళ్ల కోసం ఎప్పుడో తెల్లవారుజామున 4, 5 గంటలకు నిద్ర లేస్తాం. ఇక్కడ లైట్లు లేవు. పైగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నీళ్ల కోసం కనీసం 30 నిమిషాల పాటు నడిచి వెళ్లాలి” అంటూ గిరిజన మహిళలు ఆవేదనను వ్యక్తం చేశారు.