నెగెటివ్‌ పదాలను మాట్లాడుతున్నారా…

నెగెటివ్‌ పదాలను మాట్లాడుతున్నారా...పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ ఉందని మా పిల్లలు చెప్పడంతో నా హబ్బీ (డా.హిప్నో కమలాకర్‌), నేను మా పిల్లల స్కూల్‌కి వెళ్లాం. అక్కడ చాలా హడావిడిగా ఉంది. కొంతమంది పిల్లలు భయపడుతూ, మరి కొంత మంది హుషారుగా, ఇంకొందరు ఏడుస్తూ ఉన్నారు. మేం క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెడుతున్నామో లేదో… ఒక బాబు తల్లి ”నువ్వు మొద్దువి, ఎందుకు పనికిరావు, పదా ఇంటికి నీ పని చెపుతా” అని తిడుతూ లాక్కు పోతుంది. వాడు నేను రాను అని ఏడుస్తున్నాడు. విషయమేంటని టీచర్‌ని అడిగితే … వాడికి ఒక సజ్జక్ట్‌లో మార్కులు తగ్గాయి అందుకే అన్నారు.
ఆవిడే కాదు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అనరాని మాటలు అంటుంటారు. ఆ మాటల వల్ల పిల్లలు ఎమోషనల్‌గా ఇబ్బంది పడటం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, చదువు మీద ఆసక్తి తగ్గుతుంటాయి. భయంతో పెరుగుతారు. లేదా అసలు మాట వినకుండా పోతారు. పెద్దలు అన్నీ మాకే తెలుసు పిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ పిల్లలతో మాట్లాడితేనే కదా తెలిసేది….
భావోద్వేగ ప్రజ్ఞ (ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌)
జీవితంలో విజయం సాధించడానికి భావోద్వేగ మేధస్సు ముఖ్యం. పిల్లల భావోద్వేగాలను గ్రహించడం, అర్థం చేసుకోవడం చేయాలి. ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఉన్న వ్యక్తులు ఒత్తిడి, సంఘర్షణలను అధిగమించడంలో, మార్పులకు అనుగుణంగా తామూ మారుతూ ఉంటారు.
భావోద్వేగ ప్రజ్ఞను ఈ పదాలతో అణిచివేతకు గురిచేస్తున్నామా?
నీవు ఎందుకు పనికి రావు అనే మాట పదే పదే అనటం వల్ల పిల్లలు చదువులో వెనకాడతారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. తమలో ఉన్న లోపాలను ఎక్కువగా ఊహించుకుని, బాధ పడుతూ ఆత్మన్యూనతకు గురవుతారు.
అమ్మ నాకు బాగోలేదని చెపుతుండగానే… బాగానే ఉన్నావుగా, ఏం మాయ రోగం నీకు… అని అనడం వల్ల వారి భావోద్వేగ వికాసాం దెబ్బతింటుంది. సమర్థవంతమైన కమ్యూనికేషన్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి భావాలను వ్యక్తం చేయనివ్వదు. వారి ఆందోళనలు, భయాలను అణచివేయడానికి కూడా దారి తీస్తుంది. అంతర్లీన సమస్యలను పరిష్కరించే అవకాశాలను కోల్పోవచ్చు.
పిల్లల్ని ఏ విషయాలపై దృష్టి పెట్టడం లేదని, దేనిమీదా శ్రద్ధ చూపవేందుకని అంటున్నారంటే, వారు ఇష్టపడే ఇతర విషయాలపై మీరు ఆసక్తి చూపడం లేదని అర్థం. కాబట్టి వారికి దేనిపైనా ఎందుకు శ్రద్ధ లేదు అనేదానిపై దృష్టి పెట్టే బదులు, పిల్లలు బాగా ఇష్టపడే మరో సబ్జెక్ట్‌ ఏదైనా ఉందా అని వారినే అడిగి చూడండి. వారికి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి.
నా మాట వినవెందుకు? కొన్నిసార్లు పిల్లలు మీ ఇష్ట ప్రకారం పని చేయకపోవచ్చు. నా మాట ఎందుకు వినవు అని నిర్మొహమాటంగా అడిగే బదులు, ఆ పని చేయడానికి వాళ్లకేమైనా ఇబ్బంది ఉందా అని అడగడానికి ప్రయత్నించండి.
ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని పిలిచినా రారు. వెంటనే మర్యాద తెలీదు నీకు అనేస్తాం… వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, వారు అగౌరవంగా ఉన్నారని కాదు, ఆ విషయం వారికి కష్టంగా ఉండవచ్చు. అర్థం కాకపోయినా చెప్పలేరు. మీరు సున్నితంగా చెప్పి చూడండి.
నాతో మాట్లాడకు పో. ఇది వినడానికి ఎవరూ ఇష్టపడరు. పిల్లలతో ఇలాంటివి అనడం వల్ల వారి మానసిక శ్రేయస్సుపైనే కాదు, మీ ఇద్దరి ఆత్మీయతపై కూడా హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఈ పదాలు పిల్లలను తీవ్రంగా గాయపరుస్తాయి. వారిని గందరగోళానికి గురి చేస్తుంది. మానసికంగా బాధిస్తుంది. భవిష్యత్తులో బహిరంగంగా కమ్యూనికేట్‌ చేసే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది.
కాబట్టి కష్టమైన క్షణాల్లో కూడా ప్రేమ, సహనంతో కూడిన, వినడానికి ఇష్టపడే పదాలను ఎంచుకోవడం చాలా కీలకం. ”దయచేసి సమస్య గురించి ఆలోచించడానికి కొంత సమయం ఇవ్వండి. మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాను” అనే సరళమైన పదాలు సమస్యను చూసే దృక్పథాన్ని మార్చుతుంది. ప్రతికూల ఆలోచనల నుండి పిల్లలను కాపాడుతుంది. ఇలాంటివన్నీ పెద్దలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలకి కూడా తమ ఆలోచనలు చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి. అప్పుడు కచ్చితంగా పిల్లల బాధను తెలుసుకోగలరు. పరిష్కారం చూపించగలరు.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపీస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌