స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి 

– అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 
నవతెలంగాణ- సిరిసిల్ల 
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టరు అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలని అన్నారు. స్టేజీ, బారికేడింగ్, సీటింగ్, సానిటేషన్, త్రాగునీరు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో సిరిసిల్ల ఆర్డీఓ ఎన్.ఆనంద్ కుమార్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.గంగయ్య, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, పర్యవేక్షకులు వేణు, సిరిసిల్ల ఉప తహశీల్దార్ మురళి, తదితరులు పాల్గొన్నారు.