వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

– మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌
నవతెలంగాణ-మియాపూర్‌
ఇటీవల మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యక్తి హత్య కేసు సంబంధించిన నిందితులను అరెస్టు చేసినట్టు మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బోరబండకు చెందిన నదీమ్‌ను హత్య చేసిన yషేక్‌ అజీజ్‌ అహ్మద్‌, ఏ2 షేక్‌ రిజ్వాన్‌, ఏ3 పొడవు మహేష్‌, ఏ4 ట్రాన్స్‌జెండర్‌ శ్యామలదేవిలను అరెస్టు చేసినట్టు చెప్పారు. హత్యకు గురైన నదీమ్‌ ఫ్లవర్‌ డెకరేషన్‌ పని చేస్తుండేవారనీ, ఆయనపై బోరబండ పీఎస్‌లో రౌడీ షీట్‌ నమోదైనట్టు తెలిపారు. బోరబండకు చెందిన ఎ1, ఎ2, ఎ3 లు మృతుడు నదీమ్‌ ఒకే బస్తీలో ఉండే వారనీ, ఆయనతో ఆ ముగ్గురు గొడవ పడుతుండేవారని విచారణ తెలిసినట్టు వెల్లడించారు. ఈ ముగ్గురు పథకం ప్రకారం నదీమ్‌ను చంపాలని ప్లాన్‌ చేసుకుని, బర్త్‌ డే పార్టీ ఉందని పిలిచి, మద్యం తాగిన తర్వాత హత్య చేశారని వివరించారు. మూడు టీంలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. మర్డర్‌ చేసిన అనంతరం ట్రాన్స్‌ జెండర్‌ శ్యామలదేవి ఇంట్లో ఆశ్రయం తీసుకుని, ఆమె సహకారంతో పారిపోవాలని చూశారని తెలిపారు.ఈ కేస్‌ ఛేదించే విషయంలో సీఐ ఎన్‌. తిరుపతి, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, రవి కిరణ్‌ వెంకన్న, టీం కృషి చేసినట్టు తెలిపారు.భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.