మహిళా రైతుల చిత్రకళ

మహిళా రైతుల చిత్రకళమమతా చిట్నిస్‌ సేన్‌… ఈమె ఓ జర్నలిస్ట్‌. అంతే కాదు అద్భుతమైన పెయింటర్‌ కూడా. మహిళా విముక్తి, కళ, సంస్కృతి పట్ల మక్కువ ఉన్న ఆమె తనకు తెలిసిన కళను కేవలం తనకే పరిమితం చేసుకోలేదు. గ్రామీణ మహిళలకు ఆర్ట్‌ స్పేస్‌లను సృష్టించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తోంది. దీని కోసం రెడ్‌ హౌస్‌ ఆర్ట్‌ ఎక్స్ఛేంజ్‌ అనే ఆర్ట్‌ స్టూడియోను నిర్మించిన ఆమె కృషి గురించి నేటి మానవిలో తెలుసుకుందాం…
మహారాష్ట్రలోని రోనాపాల్‌ అనే గ్రామంలోని మహిళా రైతులు భగభగా మండి పోతున్న ఎండలో, బురద నీటిలో చీలమండలం వరకు తడిసిన పాదాలతో వరి పొలాల నుండి బయటికి వస్తున్నారు. ఎండ వేడికి వారి బుగ్గల నుండి చెమట కారిపోతోంది. సూర్య ప్రతాపాన్ని భరించలేక తమ అరచేతులను ఆకాశానికి అడ్డు పెట్టి ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మహిళలంతా పగలంతా పొలంలో కష్టపడి పని చేసిన తర్వాత ఇంటికి వెళ్లడం లేదు. తమ హృదయాలను ఖాళీ కాన్వాస్‌లపై చిత్రించుకోవడానికి ఆర్ట్‌ స్టూడియో వైపు నడుస్తున్నారు. ఎందుకంటే ఈ మహిళలంతా ది రెడ్‌ హౌస్‌ ఆర్ట్‌ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా ఉన్నారు. ఇది రోనాపాల్‌ గ్రామంలోని వరి పొలాలతో చుట్టుముట్టబడిన ఉన్న ఓ కళా స్థలం. తమకు తెలిసిన కళ ద్వారా కొంకణ్‌ ప్రాంతంలోని మహిళా రైతులంతా శక్తివంతంగా తయారవుతున్నారు. జీవితం, ప్రేమ, అభిరుచి, కోరిక, చర్య, శక్తి, విశ్వాసాన్ని సూచించే కొంకణ్‌ ప్రాంతంలోని ఎర్రటి నేల నుండి ఈ కళ పుట్టుకొచ్చింది. మమతా 2020లో ఈ కేంద్రాన్ని స్థాపించారు.
ఎలా మొదలయిందంటే..?
ముంబైలోని సర్‌ జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన మమతకు 2012లో తన పూర్వీకుల నుండి వారసత్వంగా కొంత భూమి వచ్చింది. కానీ ఆమె దూరపు బంధువులు ఎదురు తిరగడంతో ఆ భూమి వివాదంలో ఇరుక్కుంది. తన భూమిని తాను దక్కించుకోడానికి మూడేండ్ల పాటు న్యాయపోరాటం చేశారు. దాని కోసం ప్రతి నెలా గ్రామ న్యాయస్థానం వద్దకు వెళ్ళేవారు. అప్పుడే వరి పొలాల పక్కనే ఉండే ఒక చిన్న గదిని చూశారు. అక్కడ తమ భూమి కోసం పోరాడుతున్న చాలా మంది స్త్రీలను కలుసుకున్నారు. ఈ సందర్శనే ఆమెలో కొంకణ్‌ మహిళా రైతులపై పెయింటింగ్‌ సిరీస్‌ ఆలోచనను పుట్టించింది. తర్వాత ఈ కళను ప్రపంచవ్యాప్తంగా వివిధ గ్యాలరీలలో ప్రదర్శించడం మొదలుపెట్టారు.
ప్రయాణం అంత సులభం కాలేదు
2021లో టౌక్టే తుఫాను ఈ ప్రాంతాన్ని తాకింది. ఎడతెగని వారం రోజుల వర్షపాతం వల్ల ఎనిమిది రోజుల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. అప్పటికే నిర్మించినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాంతో భవన నిర్మాణ ఖర్చులు పెరిగాయి. కానీ ఆమె లక్ష్యం, సాధించగలను అనే నమ్మకం మమతను నిలబెట్టాయి. చివరకు 2021లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు మహిళా రైతులతో వారి స్వేచ్ఛా ఆలోచనలపై మొదటి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. తర్వాత వాటిని ఆర్ట్‌ స్పేస్‌లో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌గా ప్రదర్శించారు.
అవగాహన కల్పించేందుకు
‘వీరిలో చాలా మంది మహిళలు పెయింట్‌ బ్రష్‌ను ఎన్నడూ పట్టుకోలేదు. అలాంటి వారు అందమైన కళాఖండాలను సృష్టించారు. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది’ అని మమత చెప్పారు. ప్రాజెక్ట్‌ వైల్డ్‌ఫ్లవర్‌ అనే రెండవ వర్క్‌షాప్‌ న్యూయార్క్‌కు చెందిన కళాకారిణి సోరయా మార్కానో సహకారంతో జరిగింది. ఇందులో మహిళా రైతుల పిల్లలకు అడవుల్లో దొరికే వైల్డ్‌ ఫ్లవర్స్‌కు రంగులు వేసే పని అప్పగించారు. నెమ్మదిగా ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారులు, చుట్టు పక్కల గ్రామ పెద్దల దృష్టిని ఆకర్షించింది. ఆర్ట్‌ స్పేస్‌ గురించి మహిళల్లో మరింత అవగాహన కల్పించడానికి ఆమె ఒక వంటల పోటీని ఏర్పాటు చేశారు. స్థానిక మాల్వానీ వంటకాలను వండమని పోటీ పెట్టారు. వీటికి జర్జీలుగా ఉండమని అధికారులను కోరారు. జనవరి 2023లో ఆమె తన భర్తతో ఫోటో, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. దీనికి పెద్ద పెద్ద వారు హాజరయ్యారు. దాంతో మంచి గుర్తింపు వచ్చింది.
ఆలోచనలు మారుతున్నాయి
ఆర్ట్‌ స్పేస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆమెకు సవాళ్లు ఆగలేదు. మహిళలంతా దినసరి కూలీలు కావడంతో కళాకేంద్రాన్ని సందర్శించేందుకు సిద్ధపడలేదు. అయినప్పటికీ తన నిరంతర ప్రయత్నం, గ్రామ పెద్దల సహాయంతో ఖాళీ సమయంలో వారు కళా స్థలాన్ని సందర్శించేలా ఒప్పించారు. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని మధ్యాహ్నాలు కూడా ఆర్ట్‌ స్పేస్‌ను తెరిచి ఉంచేవారు. చాలా మంది సోమవారాల్లో ఖాళీగా ఉన్నందున వాటిని సందర్శించేవారు. గ్రామాల్లో కళకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియక మమత మొదట్లో తన ప్రాజెక్ట్‌ విజయవంతం కాదేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఆర్ట్‌ వర్క్‌షాప్‌ ఆలోచన మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి వర్క్‌షాప్‌ తర్వాత మహిళల ఆలోచనలో మార్పు వచ్చింది. ‘వారందరూ ఒక గంట రావడానికి అంగీకరించారు. వచ్చిన తర్వాత వారు కళను చాలా ఇష్టపడ్డారు. గంట ఉంటామని వచ్చిన వారు సాయంత్రం వరకు ఉన్నారు’ అని గుర్తుచేసుకున్నారు. మొదటి వర్క్‌షాప్‌ను పెట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు ఆర్ట్‌ స్పేస్‌లో భాగం కావాలని కోరారు. మమత మొదట్లో రెండు గ్రామాలకు చెందిన మహిళలతో దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు పది గ్రామాలకు పైగా పెరిగింది.
ముందున్న మార్గం
ఆర్ట్‌ స్పేస్‌లో షాప్‌ను ఏర్పాటు చేసి మహిళా రైతులు తమ కళ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం ఆమె లక్ష్యం. భవిష్యత్‌లో తాను నిర్వహించే ఆర్ట్‌ వర్క్‌షాప్‌తో అణగారిన వర్గాల కోసం స్థలాన్ని తెరవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్‌ 2023లో యూకేలోని బ్రిస్టల్‌లో ఈ మహిళలు రూపొందించిన పెయింటింగ్‌లను కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ అట్టడుగు మహిళలకు అందుబాటులో ఉండేలా విజువల్‌ ఆర్ట్‌, డిజిటల్‌ ఆర్ట్‌, ఫోటోగ్రఫీ వంటి విభిన్న రకాల సమకాలీన కళలను రూపొందించాలని కూడా ఆమె భావిస్తున్నారు. ‘ఈ మహిళల కోసం ప్రపంచంలో చాలా మార్పులు రావాలి. వారికి సాధికారత కల్పించడానికి, వృద్ధి అవకాశాలను అందించడానికి ఈ ఆర్ట్‌ స్పేస్‌ చిన్న ప్రయత్నం చేస్తుంది’ అంటూ ఆమె ముగించారు.
ఎదురైన సవాళ్లు
‘నేను టైఫాయిడ్‌తో బాధ పడుతున్నాను. దానికి తోడు మధుమేహం కూడా ఉన్నందున తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కరోనా సమ యంలో నేను 10 రోజులు మంచాన పడ్డాను. నా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. నేను ఇక బతుకుతానో లేదో కచ్చితంగా తెలియదు’ అంటూ ఆమె ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితం, మరణం మధ్య వేలాడుతూ కూడా ఆమె మిగతా వాటి గురించి ఆలోచించారు. ‘నా చివరి కోరికగా ఈ భూమిని ఆర్ట్‌ గ్యాలరీ కోసం ఉపయోగించాలని మా అమ్మను కోరాను’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత మమత సెప్టెంబర్‌ 2020లో తాను దాచు కున్న డబ్బుతో పాటు, మరికొంత రుణం తీసుకుని పెట్టుబడి గా పెట్టి 10,000 చదరపు అడుగుల స్థలంలో 500 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించారు. ఫొటో గ్రాఫరైన ఆమె భర్త సంజిత్‌ సేన్‌ రూపొందించిన ఆర్ట్‌ స్పేస్‌ ఇప్పుడు 4,000 చదరపు అడుగులకు విస్తరించింది. అందులో రెండు అంతర్గత ఆర్ట్‌ గ్యాలరీలు కూడా ఉన్నాయి.
మహిళా రైతులకు సాధికారత
‘కళ ఎల్లప్పుడూ నా జీవితంలో అంతర్భాగంగా ఉంది. కనుక నా ఈ కళా అభిరుచి ద్వారా అట్టడుగున ఉన్న మహిళా రైతులకు సాధికారత కల్పించాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె పంచుకున్నారు. 2015లో మమత తన భూమి వివాద కేసులో విజయం సాధించారు. తన కళా కేంద్రాన్ని ప్రారంభించడానికి ఆ భూమినే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె తల్లి దీనికి ఒప్పుకోలేదు. మమత కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో చివరి దశలో ఉన్నంత వరకు తల్లి ఆమెను వ్యతిరేకిస్తూనే ఉంది.