– తెలంగాణ అగ్గిబరాటా కమలాదేవి
– అర్ధశతాబ్దం పైచిలుకు పోరాట చరిత్ర
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి. చిన్నతనంలోనే వివాహం అయినా భర్త ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదువుకుని ఇతరులకు సహాయం చేశారు. పాఠశాల, గ్రంథాలయాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో పాల్గొంటూ కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గెరిల్లా దళంలో పనిచేశారు. మూడు సార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర శాసన సభలో తొలి మహిళా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
నవతెలంగాణ- ఆలేరుటౌన్
యాదాద్రి-భువనగిరి జిల్లా మంతపురిలో పల్లా వెంకటరాంరెడ్డి, లక్ష్మీ నరసమ్మలకు 1920 జూన్‌లో కమలాదేవి జన్మించారు. ఆమె అసలు పేరు రుక్మిణి. ఆమెకు పన్నెండో ఏట ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహమైంది. ఆ తరువాత అమ్మాయిని హైదరాబాద్‌కు పంపించి చదివించాలని రామచంద్రారెడ్డి వారి మామకు చెప్పారు. వివాహానంతరం రుక్మిణికి కమలాదేవిగా పేరు మార్చారు. 1932లో చదువు కోసం కమలాదేవి హైదరాబాద్ వచ్చారు. ఆంధ్రోద్యమ పితామహుడు హనుమంత రావు కృషి వల్ల అమ్మాయిలకు పాఠశాల, హాస్టల్ ఏర్పాటైంది. మూడో తరగతిలో చేరిన కమలాదేవి.. ఆ హాస్టల్‌ను ప్రారంభించారు. చదువుకునే సమయం లోనే ఆంధ్ర మహిళాసభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరులో పాల్గొన్నారు. భారత స్వాతంత్రో ద్యమ యోధురాలుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరనారిగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. ఆమెది అర్ధశతాబ్దం పైచిలుకు పోరాట చరిత్ర.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా..
1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి కమలాదేవి పోటీ చేసి, భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలు అంటే 15 ఏండ్లు అదే స్థానం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 1963-64 మధ్య ప్రతిపక్ష కమ్యూనిస్టు నాయకురాలుగా పని చేశారు. ఈ విధంగా ఆంధ్ర శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా నిలిచారు.
గెరిల్లా దళంలో..
తెలంగాణలో నిజాం పాలకులు రజాకార్లనూ, రిజర్వు పోలీసులనూ గ్రామాల మీదకి ఉసిగొలిపి మారణహోమం సృష్టించారు. ఈ దుశ్చర్యలను ఎదుర్కోవడానికి వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగింది. ఇదే సమయంలో ఏర్పడిన మహిళా గెరిల్లా దళంలో కమలాదేవి పనిచేశారు. ఈ పోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది. జాగీర్దారులు, భూస్వాములు, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములనూ, వ్యవసాయ యోగ్యమైన అటవీ భూములనూ ఈ గెరిల్లా దళాలు హస్తగతం చేసుకొని, పేద రైతులకూ, ప్రజానీకానికీ పంచిపెట్టారు. భూస్వామ్య దోపిడీకాండకు వ్యతిరేకంగా సాగిన ఈ చారిత్రక పోరాటంలో కమలాదేవి ప్రధాన పాత్ర వహించారు. పురిటి బిడ్డను వదిలి ఉద్యమకార్యకర్తగా ఆమె గెరిల్లా పోరాటం సాగించి, అజ్ఞాతవాసం, ఆ తరువాత జైలు జీవితం గడిపారు. పోరాట పటిమల్లో ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికే కాక భవిష్యత్ తరాలకు మార్గదర్శకం. 1948లో స్వతంత్ర భారతంలో నైజాం రాష్ట్రం విలీనం అయిన తరువాత అప్పటి వరకూ అడవిలో ఉన్న వారందరూ ఆయుధాలు వదిలి జనజీవనంలోకి రావాలని భారత ప్రభుత్వం కోరింది. కానీ, తమ ఉద్యమాన్ని మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుందనే భావనతో కొందరు ఉద్యమకారులు వెనక్కి రాలేదు. వారిలో కమలాదేవి ఒకరు.