జయంతి బురుడా… అట్టడుగు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఆడపిల్లకు చదువంటేనే వ్యతిరేకించే ఊరు అది. అలాంటి ప్రాంతం నుండి మొదటి మహిళా ఆదివాసీ జర్నలిస్ట్‌గా చరిత్ర సృష్టించారు. కోయ, గిరిజన సమాజానికి బలీయమైన గొంతుగా ఉద్భవించారు. గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకే ఫోర్బ్స్ ప్రచురించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఈ ఏడాది స్థానం సంపాదించుకున్నారు. చిన్నతనంలో తనకు ఓదార్పు నిచ్చిన అడవి బిడ్డల గొంతులు, పోరాటాలను దృశ్యమానం చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా, సేరపల్లి గ్రామంలోని నిశ్శబ్ద అడవుల్లో పుట్టి పెరిగారు జయంతి. చిన్నతనంలో తరచుగా అడవిలోకి వెళ్లి ఆ అందాలను ఆస్వాదించేవారు. ఇతర పిల్లలు ఫోన్లతో ఆడుకుంటుంటే, తన అన్న మత్తులో ఊగిపోతూ గొడవ పడుతుంటే వీటన్నింటికీ దూరంగా ఆమె మాత్రం ప్రకృతి ఒడిలో ఓదార్పు పొందేవారు. ఈ అనుభవాలు ఒకరోజు ఆమె కోయ గిరిజన సంఘాల హక్కుల కోసం పోరాడే వారి పక్షం నిలబడేలా చేశాయి. ఈ రోజు మల్కన్‌గిరి మొదటి మహిళా ఆదివాసీ జర్నలిస్ట్‌గా నిలిపాయి.
ఆమెపై లోతైన ముద్ర
‘నా కమ్యూనిటీతో నాకున్న అనుబంధం నన్ను ఏకాంత బిడ్డగా మార్చింది. ఈ రోజు మా కథలు ప్రపంచానికి చెప్పడానికి నన్ను ప్రోత్సహించింది’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. బాలికల అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉన్న సమాజంలో జయంతి బాల్యం గడిచింది. అయితే ఆమె తండ్రి జిల్లా పంచాయితీ సభ్యుడు. చదువు విలువ తెలిసిన వ్యక్తి కనుక తన ఆడపిల్లలను చదివించాలని నిర్ణయించుకున్నాడు. అలా వారి కమ్యూనిటీలో మొదటి విద్యావంతుల కుటుంబంగా మారింది. ఆమె తండ్రి క్రియాశీలత ఆమెపై లోతైన ముద్ర వేసింది. ‘మా నాన్న ఎప్పుడూ ధోతి ధరించి ఆదివాసీ హక్కుల కోసం పోరాడేవారు. మా అమ్మ కష్టాల్లో ఉన్న కుటుంబాల కోసం వండి పెట్టేవారు. అయితే నేను చదువుకోవడానికి ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు మా నాన్న భయపడేవాడు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
అడ్డంకులు అధిగమించి
తన సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలని జయంతి మల్కన్‌గిరిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పూర్తి చేశారు. గిరిజన పిల్లలకు పాఠాలు బోధించారు. యుద్ధ కళలు కూడా నేర్చుకున్నారు. అయితే ఆమె కలలు నిజం చేసుకునేందుకు సామాజిక, ఆర్థిక అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. జర్నలిజం కోసం తన ఊరికి 150 కిలోమీటర్ల దూరంలోని కొరాపుట్‌లోని ఒడిశా సెంట్రల్ యూనివర్శిటీలో చేరారు. అయితే అక్కడ హాస్టల్ ఫీజును భరించలేకపోయారు. అంతేకాదు తనకు తెలియని కొత్త ప్రపంచంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే స్నేహితులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక కుటుంబం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. జర్నలిజం విద్యను పూర్తి చేయడానికి వీలు కల్పించింది. డాక్యుమెంటరీ చిత్రనిర్మాత బీరెన్ దాస్ వద్ద ఇంటర్న్‌షిప్ చేశారు. ఆయన్ని ఆమె తన గురువుగా చెప్పకుంటారు.
ఆకాంక్షలను సుస్థిరం చేసింది
జర్నలిజం పూర్తి చేసిన వెంటనే జయంతి కళింగ టీవీలో చేరారు. భారతదేశంలో మావోయిస్ట్ తిరుగుబాటుతో దెబ్బతిన్న, అత్యంత వెనుకబడిన, సంఘర్షణతో నిండిన ఓ ప్రాంతం నుండి తన ఉద్యోగం ప్రారంభించారు. గిరిజన మహిళా జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘న్యూస్‌రూమ్‌లలో, మగ సహోద్యోగులు తరచూ నన్ను పక్కన పెట్టేవారు. నా గిరిజన గుర్తింపు, భాషా అడ్డంకులను వారికి అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కొన్ని సమయాల్లో నాకు దక్కాల్సిన క్రెడిట్‌ను కూడా తీసుకున్నారు’ అని ఆమె పంచుకున్నారు. 2017లో నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఆమె సామర్థ్యాన్ని గుర్తించింది. గిరిజన మహిళలను ప్రోత్సహించేందుకు ఆమెకు ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది. ఈ వేదిక ద్వారా ఆమె అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా గిరిజన మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను జయంతి ప్రస్తావించారు. ఇలా ఈ ఫెలోషిప్ ఆమెలో ఓ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. తమ కమ్యూనిటీ ప్రజలు ఎదుర్కొంటున్న లింగ, సామాజిక అసమానతలను పరిష్కరించడానికి కొంత వరకు సహకరించింది.
వైవిధ్యం ఉన్న కథలు
జయంతి రిపోర్టింగ్ ఆమె సంఘంలోని కఠోర వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. ఆమె మల్కన్‌గిరిలోని ప్రసూతి ఆరోగ్య సవాళ్లను డాక్యుమెంట్ చేశారు. అక్కడి మహిళలు వైద్య సదుపాయాలు లేకుండా ప్రసవించేవారు. అందుకే హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడం కోసం కృషి చేశారు. అలాగే ఆమె ఆసుపత్రిలో ప్రసవించిన ఓ తల్లితో కలిసి రెండు రోజులు ప్రయాణించి వారి గ్రామానికి వెళ్లారు. ‘ఆమె ఇల్లు జలమయమైంది. మాకు అందుబాటులో ఉన్న రవాణా మార్గాలు ట్రాక్టర్, ఎద్దుల బండి, బస్సు మాత్రమే. మంత్రసాని, సంఘం సభ్యులు ఆమె బతుకుతుందనే ఆశ వదలుకున్నారు. కానీ సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బిడ్డకు జన్మనిచ్చింది’ అని జయంతి పంచుకున్నారు. నిరక్షరాస్యతను అధిగమించేందుకు, గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, మద్యం వ్యసనాన్ని పరిష్కరించేందుకు ఆమె చేసిన కృషి గ్రామంలోని అన్ని మద్యం దుకాణాలను మూయించింది. అంతేకాదు రుతుక్రమ పరిశుభ్రతపై కూడా ఆమె దృష్టి సారించారు. ”రుతుస్రావం గురించి మాట్లాడటం ఇక్కడ నిషిద్ధం. రుతుక్రమం ప్రారంభమైన అమ్మాయిలు చదువ మానేస్తున్నారు. అపరిశుభ్రమైన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. వారి పరిస్థితులు మార్చడానికి వారి ధైర్యం నాకు స్ఫూర్తినిస్తోంది. వారి జీవితాలకు, ప్రపంచానికి మధ్య వారధిగా నా పాత్రను నేను చూస్తాను’ అని ఆమె చెప్పారు.
రిపోర్టింగ్‌కు మించి
సంఘం పట్ల ఆమెకున్న నిబద్ధత జర్నలిజానికి మించి విస్తరించింది. 2018లో బడా దీదీ యూనియన్ అనే మహిళా సమిష్టిని ప్రారంభించారు. ఇది రుతు పరిశుభ్రత, లైంగిక భద్రతపై అవగాహన పెంపొందించడానికి యువతులతో కలిసి పని చేస్తుంది. ఆ ప్రాంతంలో డ్రాపౌట్ రేట్లను తగ్గించడంపై దృష్టి సారించింది. ‘పాఠశాలలోని లైంగిక వేధింపులు అమ్మాయిలకు అవరోధాలుగా ఉన్నాయని గుర్తించాము. ఆ సమయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలో వారికి అవగాహన కల్పిస్తాం’ అని జయంతి చెప్పారు. ఇలా ఆమె తన జర్నలిజం వృత్తిని గిరిజన ప్రజల బతుకులో వెలుగులు నింపేందుకు ఉపయోగిస్తున్నారు. అట్టడుగు ప్రజల గొంతుగా మారి వారి భవిష్యత్తుకు మద్దతు ఇస్తున్నారు.