ప్రజలకు సేవలందించే వారికి శిక్షలా….?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో సుజావతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలకు సేవలందించిన నర్సులను శిక్షిస్తారా? అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రిటైర్డ్‌ నర్సుల నాయకురాలు సుజావతి ప్రశ్నించారు. ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ వినలేదంటూ 30 మంది నర్సింగ్‌ విద్యార్థులకు శిక్ష విధించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైర్డ్‌ నర్సులు సుజావతి, విశ్వశాంతి తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేడుకలను నిర్వహించారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 203వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్‌ కట్‌ చేసి నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమా వేశాన్ని ఉద్దేశించి సుజావతి మాట్లాడుతూ పీఆర్సీ, పీఆర్సీకి మధ్య చాలా గడువు ఉంటుండంతో తమ సర్వీసుల్లో ఒక పీఆర్సీ కోల్పోయినట్టు తెలిపారు. ఇప్పటికే వేయాల్సిన పీఆర్సీ ఆలస్యమైందనీ, దాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏండ్ల తరబడి ప్రభుత్వ సేవలందించిన తమకు నగదురహిత ఉచిత వైద్యసేవలనందించాలని డిమాండ్‌ చేశారు.
అమ్మకు కలలుంటాయి….
నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన ‘అమ్మకు కలలుంటాయి…’ అనే డాక్యుమెంటరీ ఆకట్టుకుంది. పదవీ విరమణ పొందిన వారికి కూడా అవసరాలు, కోరికలుంటాయనీ, వాటిని గుర్తించాలనే సందేశం ఆకట్టుకుంది. ఇద్దరు తల్లులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ డాక్యుమెంటరీ ఆహుతులను ఆకట్టుకుంది.
నైటింగేల్‌ బయోగ్రఫీ
నర్సింగ్‌ వృత్తికి ఆద్యురాలు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జీవిత చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీ ఆలోచింపజేసింది. యుద్ధ సమయంలో ఆమె కనబరిచిన సేవాగుణం, ప్రేమ తర్వాతి తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. బ్రిటన్‌ వైద్య విభాగంలో జరిగిన అవకతవకలపై అక్కడి రాణి ఎలిజబెత్‌ ఎదుట ప్రస్తావించడం, నైటింగేల్‌ పట్టుదలతో రాయల్‌ కమిషన్‌ ను సాధించడంతో ఆమెను దానికి చైర్‌పర్సన్‌ చేశారు. వైద్య విభాగంలో అవకతవకతలపై ఆమె నివేదిక సమర్పించడంతో, నాటి ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టలేదు. అయితే ఆ నివేదికలోని అనేక ప్రజోప యోగకర అంశాలను అమల్లో పెట్టారు. తర్వాది కాలంలో ఆమె కృషి ఫలితంగా నర్సింగ్‌ అనేది ఒక వృత్తిగా మారింది. ప్రపంచ ఆరోగ్య సేవా రంగంలో నైటింగేల్‌ వేసిన ఈ అడుగు చరిత్రలో కీలకంగా మిగిలిపోయింది. ఈ వేడుకల్లో సీనియర్‌ నర్సులు రాజ్య లక్ష్మి, కుమారి సులోచన పాల్గొన్నారు.