ఐబీఆర్‌వో అధ్యక్షురాలిగా…

As the President of IBRO...మన మెదడు రహస్యాల గని. భావోద్వేగాలకు నెలవు. అటువంటి మెదడు గురించి దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోన్న సంస్థ ఐబీఆర్‌వో. అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత అధ్యక్షురాలిగా నియమించబడ్డారు. ఆమే శుభ టోలే. ఇంటర్నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా శాస్త్రవేత్తగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం…
శుభ ప్రస్తుతం ముంబయిలోని ప్రముఖ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సంస్థ టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ డీన్‌గా పని చేస్తున్నారు. ఇండియన్‌ అకాడీ ఆఫ్‌ సైన్సెస్‌ ‘ఉమెన్‌ ఇన్‌ సైన్స్‌’ కమిటీకి చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. విద్యావంతుల కుటుంబంలో ముంబయిలో ఆమె జన్మించారు. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పని చేశాడు. ముంబయిలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌, డాక్టోరల్‌ డిగ్రీ చేశారు. చికాగో యూనివర్సిటీలో పోస్ట్‌-డాక్టోరల్‌ రీసెర్చి పూర్తి చేశారు.
కళల్లోనూ ప్రవేశం
శుభ టోలే శాస్త్రవేత్త మాత్రమే కాదు కథక్‌ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్‌ ఏంజిల్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్‌ దగ్గర కథక్‌ నేర్చుకున్నారు. ‘కథక్‌ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేనూ, నా పెద్ద కొడుకు కథక్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలా ప్రాక్టీస్‌ చేస్తుంటారు’ అంటుంది శుభ. ఆమె భర్త సందీప్‌ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటా రనుకుంటే మనం పొరబడినట్టే. పెయింటింగ్‌ నుంచి మ్యూజిక్‌ వరకు ఎన్నో కళల గురించి వారి ఇంట్లో చర్చ జరగుతుందంటా. ‘సైన్స్‌ అనేది ఓ సృజనాత్మక వృత్తి’ అంటారు ఆమె.
చర్చలతో పరిష్కారం
ప్రస్తుతం ఐబీఆర్‌వో అధ్యక్ష పదవి చేపట్టిన శుభ ‘అభివృద్ది చెందుతున్న దేశాలలో పని చేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్‌మెంట్‌లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్‌ సొసైటీలు, ఫెడరేషన్‌లకు ఇంటర్నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (ఐబీఆర్‌వో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన దీని నినాదం: ప్రొవైడింగ్‌ ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్లోబల్‌ న్యూరోసైన్స్‌. గతంలో దీని అధ్యక్షులుగా యూరోపియన్‌, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతి పెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభకు దక్కింది.