పెస‌ల‌తో ప‌సందుగా..

పెస‌ల‌తో ప‌సందుగా..పాయసం.. పొంగలి.. మొలకెత్తిన గింజలు.. సున్నండలు.. పెసరట్టు.. ఎలా తీసుకున్నా.. పెసల రుచి పసందుగానే ఉంటుంది. కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే తినాలిపిస్తాయి పెసల వంటకాలు. రకరకాల వంటకాల్లో, చర్మ సౌందర్య సాధనాల్లో ఉపయోగించే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. మన సంప్రదాయ ఆహారాల్లో పెసలు ఒకటి. పూర్వం నుంచి ఎక్కువగా పెసలు వాడుతూ వస్తున్నాం. ఇప్పుడు మూంగ్‌ దాల్‌ అంటూ వచ్చిన స్నాక్‌ ఐటమ్‌ చిన్నా, పెద్దా అందరికి ప్రియమే. వీటిలో విటమిన్‌ బి, సి, మాంగనీస్‌తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కాపాడటంలో పెసలు ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పెసలతో ప్రత్యేక వంటకాలు నేటి మానవిలో…
రోటీ
కావలసిన పదార్థాలు : పెసలు – పావు కిలో, గోధుమ పిండి – అర కప్పు, ఉప్పు రుచికి సరిపడ, పసుపు – పావు టీ స్పూను, కారం – రెండు స్పూన్లు, నెయ్యి – రొట్టెలు కాల్చుకునేందుకు.
తయారీ విధానం : ముందుగా పెసలను సన్న సెగమీద వేయించుకోవాలి. అవి చాల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా రాకపోతే.. జల్లెడతో జల్లించుకోవాలి. ఆ పిండిలో పావు కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులో పావు స్పూను పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కారం, మూడు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోస్తూ వీటన్నిటినీ ముద్దలా చేసుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక అరగంట నాననివ్వాలి. ఆ తర్వాత రొట్టెకు సరిపోయేలా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను పొడిపిండి వేసుకుంటూ చపాతీల్లా ఒత్తుకోవాలి. సన్న సెగమీద చపాతీల్లా కాల్చుకుంటే.. ఎంతో రుచికరమైన పెసల రోటీ సిద్ధమైనట్టే. నెయ్యితో కాల్చుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. వీటిని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
పునుగులు
కావాల్సిన పదార్థాలు : పెసర పప్పు – 2 కప్పులు, అల్లం – 1 అంగుళం, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 3, జీలకర్ర – 1 టీస్పూన్‌, కరివేపాకు – గుప్పెడు, కొత్తిమీర – 1 కట్ట, ఉప్పు – రుచికి తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం : పెసరపప్పును బాగా కడిగి.. ఓ గంట నీటిలో నానబెట్టాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమర్చి, అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకుని పునుగులకు సిద్ధం చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును మరోసారి బాగా కడిగి నీరు లేకుండా మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. దానిలో ఉప్పు కూడా వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కాస్త పెసరపప్పు ఉండేలా గ్రైండ్‌ చేసుకోవాలి.
ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో ఈ పెసరపప్పు మిశ్రమం వేయాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి పిండిని బాగా కలపాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. వేసిన అన్ని పదార్థాలు దానిలో కలిసేలా పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. స్టౌవ్‌ వెలిగించి దానిపై బాండీ పెట్టుకొని డీప్‌ ఫ్రైకి సరిపడనంత నూనె వేసుకుని మీడియం మంట మీద ఉంచండి. నూనె బాగా కాగిన తర్వాత రెడీ చేసుకున్న పెసరపిండి మిశ్రమంతో చిన్న చిన్న పునుగులు వేసుకోండి. పునుగులు 70శాతం వేగిన తర్వాత వాటిని కడాయి నుంచి తీసేయండి. మిగిలిన పిండితో కూడా ఇలా చేయండి. పిండి అంతా పూర్తి అయిన తర్వాత అన్ని కలిపి మరోసారి వేయించండి. ఇలా చేయడం వల్ల పునుగులు సమానంగా వేగుతాయి. వీటిని పెసరపప్పుకాకుండా, పెసలతోనూ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి.
మసాల కూర
కావలసిన పదార్థాలు : పెసలు- అరకప్పు, పసుపు -పావు టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడ, నెయ్యి – ఒక స్పూను, నూనె – రెండు స్పూన్లు, జీలకర్ర – ఒక స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిరపకాయలు – మూడు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, టమాటాలు – మూడు, కారం – రెండు స్పూన్లు, దనియాల పొడి – ఒక స్పూను, గరం మసాలా పొడి – అర టీ స్పూను, కొత్తిమిర – కొద్దిగా.
తయారీ విధానం : పెసలను ముందుగా నాలుగైదు గంటలు నానబెట్టాలి. నానిన పెసలను కొద్దిగా నీళ్లు, పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో ఒక విజిల్‌ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. అవి ఉడికాక.. బాండీలో ఒక స్పూను నెయ్యి, రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకుని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గపెట్టాలి. ఇప్పుడు ఉడికించిన పెసలను వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమిర తరుగు వేసి స్టఫ్‌ ఆఫ్‌ చేయటమే. ఈ కూర రొట్టెలలోకి చాలా బాగుంటుంది.
ఇడ్లీ
కావలసిన పదార్థాలు : పెసలు ఒక కప్పు, మినపప్పు – అర కప్పు, ఉప్పు తగినంత, నూనె – కొద్దిగా.
తయారీ విధానం : పెసలు, మినపప్పును విడివిడిగా రాత్రి నానపెట్టుకోవాలి. రెండిటినీ విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. రెండిటినీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని సుమారు మూడు గంటల పాటు నాననివ్వాలి. ఉప్పును చూసుకుని అడ్జస్ట్‌ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసుకొని పిండిని ఇడ్లీల మాదిరిగా వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారాక ఇడ్లీ ప్లేట్‌ నుండి తీసుకోవటమే. ఇవి సాంబార్‌, కొబ్బరి చట్నీతో ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. షుగర్‌ పేషంట్‌లకు ఇవి చాలా మంచిది.
పాయసం
కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు – ఒక కప్పు. బెల్లం – ఒక కప్పు, పాలు – అరలీటరు, కొబ్బరి – అరకప్పు, ఇలాచీలు -4, కిస్‌ మిస్‌ -10, జీడిపప్పు – 10, నెయ్యి -4 స్పూన్లు.
తయారీ విధానం : ముందుగా పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును పాలల్లో ఉడకబెట్టాలి. అవి కాస్త మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం తురుము కలపాలి. బెల్లం కరిగి.. పాయసం చిక్కబడే ముందు కొబ్బరి తురుము కలిపి కాసేపు మరగనివ్వాలి. తర్వాత ఇలాచి పొడి కలపాలి. స్టవ్‌ కట్టేసి ముందు వేయించిన జీడిపప్పు, కిస్‌ మిస్‌ కలిపి..
వేడి వేడిగా తింటే కమ్మగా ఉంటుంది.