గుజరాతీ బాసుల చెప్పులు మోసే సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదు

– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ ఘాటు స్పందన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదు’ అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ట్వీట్‌ చేశారు. మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేస్తూ కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో మంత్రి కేటీఆర్‌ కూడా అంతే ఘాటుగా స్పందించారు. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా మిలియన్‌ మార్చ్‌కు పుష్కరకాలం గడిచిందనీ, కేసీఆర్‌ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదష్టకరమని ట్వీట్‌ చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మిలియన్‌ మార్చ్‌కు కారణమైన నేతలకు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించడం లేదంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉద్యమాలనే అణచివేయాలని చూస్తున్నారనీ, తెలంగాణ ప్రజల కండ్లలో కడగళ్లు మిగిల్చేలా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కోట్లాది ప్రజలు కొట్లాడితే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కూర్చొని అధికారాన్ని చెలాయిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని నేడు పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ, ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ”తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం” అంటూ అదే ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ”తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదు” అంటూ ట్వీట్‌ చేశారు. మోడీ వ్యాక్సిన్‌ కనిపెట్టాడంటూ గొప్పలు చెప్పుకోవడం మానేసి, ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలంటూ ట్వీట్‌ చేశారు.