అశోక్‌ నగర్‌

Ashok Nagarకదిలించకండి
నిశ్శబ్దంగా గమనించండి
ఆ దించిన తలలు
రేపు వేల కుటుంబాలలో వెలిగే దివ్వెలు
వాళ్ళ పుస్తకాలను ముట్టుకొని చూడండి
నెమ్మది, నెమ్మది
అవి తడితడిగా ఉంటాయి
అప్పుడప్పుడూ కన్నీళ్ళతో తడుస్తుంటాయి
ఆ తడిలోనే
మెదళ్ళు మొలకెత్తుతాయి.!

‘ఇంకెప్పుడు?’ అన్న బాణం దిగని
పోరాట యోధులు
ఈ యుద్ధభూమిలో కనబడరు
తెలియగోరకు.. దిగమింగడంలో
వాళ్ళు సిద్ధహస్తులు
సునామీకి సైతం సిద్ధమై
మెదళ్ళ తెరచాపలెత్తిన వాళ్ళు
ఒప్పుకుందాం పోరాటం జరుగుతుందని
గెలుపు గురించి మాట్లాడితే
నిన్ను వీరుడనను

అలా వీధుల్లో తిరిగొద్దాం రండి
ఎటు చూసినా స్పైరల్‌ నోట్స్‌
చేతులకు చుట్టుకొని తిరిగేవాళ్ళే..
కంగారుపడకండి..
గొడవేం జరగట్లేదు
అక్కడ కర్రీస్‌ తక్కువకు దొరుకుతారు..
ఖర్చుల బుల్లెట్లను తట్టుకునే జాకెట్లు
ఇక్కడ ఎవరి దగ్గరా లేవు
పండగలకూ, పెళ్ళిళ్ళకు కూడా
ఇంటి ముఖం చూడని వీళ్ళకు
థియేటర్లు సందడి వాతావరణం గుర్తుచేస్తాయి
ఆ అమ్మాయికేం అవ్వలేదులే..!
కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరిగి
కాళ్ళు కమిలిపోయాయి అంతే..
ఇప్పుడు, ఆమె ఇంక్‌ను
ఆయుంట్మెంట్‌లా వాడాలి

వస్తుందో రాదో తెలియని ఉద్యోగం వల్ల
ఛిద్నమైన హదయాలూ లేకపోలేదు
భగమవకుండా చదువుకుంటున్నారు
వాళ్ళనేమీ అడగకండి
ఇప్పటికే కళ్ళు చిత్తడి నేలలయ్యాయి
ఆ స్టెత్‌ ఇలా తీసుకురా.!
వీళ్ళ కడుపు చెప్పే కథలు రికార్డు చేసుకో..
ఆకలిలో అంతరిక్షం చూసిన వాళ్ళు
రేపటికి అవసరం..!

అక్కడక్కడ
తల మోకాలు మీద ఆనించి
కూర్చున్నవాళ్ళు తారసపడతారు
పదండి, వీలైతే మాట్లాడుదాం
కాస్త ఛారు పంచుకుందాం!

-పి. నర్సింహా రెడ్డి, 98491 50476