ఆసియా చాంప్‌ భారత్‌

– ఫైనల్లో మలేషియాపై 4-3తో గెలుపు
– నాల్గోసారి టైటిల్‌ అందుకున్న టీమ్‌ ఇండియా
– హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ
నవతెలంగాణ-చెన్నై

హాకీ ఇండియా అదరగొట్టింది. టైటిల్‌ పోరులో మలేషియాను మట్టికరిపించి నాల్గోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా అవతరించింది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన అంతిమ సమరంలో ఆతిథ్య టీమ్‌ ఇండియా అద్వితీయ ప్రదర్శన చేసింది. తొలి అర్థ భాగం ఆట ముగిసేసరికి 1-3తో వెనుకంజలో నిలిచిన భారత్‌… గొప్పగా పుంజుకుంది. 4-3తో మలేషియాను చిత్తు చేసి ఆసియా టైటిల్‌ సొంతం చేసుకుంది. జుగ్‌రాజ్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌లు భారత్‌కు గోల్స్‌ కొట్టారు. భారత్‌ చాంపియన్స్‌గా నిలువగా.. మలేషియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో దక్షిణ కొరియాపై జపాన్‌ 5-3తో గెలుపొందింది.
ఆరంభంలో తడబాటు
గ్రూప్‌ దశలో మలేషియాను 5-0తో చిత్తు చేసిన హాకీ ఇండియా.. టైటిల్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ అంచనాల మేరకు మన్‌ప్రీత్‌సేన రాణించలేదు. మిడ్‌ ఫీల్డ్‌లో అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. టీమ్‌ ఇండియా తప్పిదాలను సొమ్ము చేసుకున్న మలేషియా తొలి 30 నిమిషాల్లోనే మూడు గోల్స్‌ కొట్టింది. ఆతిథ్య జట్టును, అభిమానులను షాక్‌లోకి నెట్టింది. 9వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించగా.. మన్‌ప్రీత్‌ ఫీల్డ్‌లో లేకపోవటంతో జుగ్‌రాజ్‌ సింగ్‌ పీసీని గోల్‌గా మలిచాడు. భారత్‌ను 1-0తో ముందంజలో నిలిపాడు. కానీ 14వ నిమిషంలో అబు కమల్‌ అజ్రారు గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. వరుసగా పెనాల్టీ కార్నర్‌లను సాధించిన మలేషియా 18వ నిమిషంలో రహీం, 28వ నిమిషంలో ఆమీనుద్దీన్‌ మహ్మద్‌ పీసీ గోల్స్‌తో 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. 30 నిమిషాల ఆట అనంతరం ఆతిథ్య జట్టు రెండు గోల్స్‌ వెనుకంజలో నిలిచింది.
ఖతర్నాక్‌ షో
ద్వితీయార్థంలో హాకీ ఇండియా రెచ్చిపోయింది. తొలి రెండు క్వార్టర్లకు భిన్నమైన ప్రదర్శన కనబరిచింది. మిడ్‌ఫీల్డ్‌ను నియంత్రణలోకి తీసుకుని మలేషియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. 45వ నిమిషంలో రెండు గోల్స్‌తో స్కోరు సమం చేసింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌ వరుస గోల్స్‌తో మలేషియాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. ఇక మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్‌ సింగ్‌ అదిరే ముగింపు అందించాడు. 56వ నిమిషంలో మెరుపు గోల్‌తో భారత్‌ను 4-3తో ముందంజలోకి తీసుకెళ్లాడు. 60 నిమిషాల ఆట అనంతరం ఓ గోల్‌ ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ ఇండియా నాల్గోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.