– పార్టీలో ఉంటారా..? వీడతారా..?
– సమాచార సేకరణలో బీఆర్‌ఎస్ శ్రేణులు
– ఇంకా నిర్ణయం ప్రకటించని మైనంపల్లి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటారా..? పార్టీని వీడతారా..? ఏ పార్టీలో చేరుతారు..? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు..? అనే విషయాలను ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర చోటా, మోటా నాయకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తిరిగి పార్టీలోనే కొనసాగితే ఓ లెక్క.. పార్టీ మారితే మరో లెక్క అన్నట్టు అధికార పార్టీకి చెందిన లీడర్లు లెక్కలేసుకుంటున్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సస్పెన్స్‌కు ఇప్పట్లో తెర పడేలా కనిపించడం లేదు. దాదాపు 20 రోజుల నుంచి నిత్యం ఆయన గురించి ఏదో వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మంత్రి హరీశ్‌రావుపై హాట్ కామెంట్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు మైనంపల్లి గురించే చర్చ జరుగుతోంది. మైనంపల్లి మాత్రం వారం, పది రోజులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే నిర్ణయం ప్రకటించడం లేదు. ఇక బీఆర్‌ఎస్ అధిష్టానం కూడా మైనంపల్లిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు మైనంపల్లి, ఇటు బీఆర్‌ఎస్ అధిష్టానం ఇద్దరూ నిర్ణయాలు ప్రకటించకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. మైనంపల్లి వైపు ఉండాలా..? అధిష్టానం వైపు ఉండాలో తేల్చుకోలేక శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. మైనంపల్లి పార్టీ మారితే ఆయనతో వెళ్లాలా..? లేక పార్టీలోనే కొనసాగాలా..? అని క్యాడర్ ఆలోచనలోపండింది.
ప్రజాప్రతినిధుల ఆరా..
మైనంపల్లి అడుగులు ఎటు వైపు వేస్తారో..? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ బీఆర్‌ఎస్ వారే ఉండటంతో మైనంపల్లి పార్టీలోనే కొనసాగుతారా..? పార్టీ మారుతారా..? అంటూ పార్టీ శ్రేణులు, క్యాడర్, చోటా, మోటా లీడర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన పార్టీ మారితే తమ నియోజకవర్గాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా..? అని ఆలోచిస్తున్నట్టు చర్చ వినిపిస్తోంది. మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరితే తమపై ఎంత ప్రభావం ఉంటుంది..? బీజేపీలో చేరితేె ఎంత ప్రభావం చూపుతారు.? అని లెక్కలేసుకుంటున్నారు.
నిర్ణయం ప్రకటించని మైనంపల్లి
ఎమ్మెల్యే మైనంపల్లి ఇంకా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు. ఇప్పటికే రెండు సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి, ఈ నెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరేలా కూడా కనిపించడం లేదు. మంత్రి కేటీఆర్‌తో భేటీకి ఆవకాశం ఉన్నా..
సీఎం కేసీఆర్‌ను కలిసి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధిష్టానానికి ఈ సమాచారం చేరినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మైనంపల్లితో భేటీ అవుతారా..? లేక లైట్ తీసుకుంటారా..? అనే విషయం త్వరలోనే తేలనుంది. సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత స్పష్టమైన హామీ రాకపోతే పార్టీ మారే యోచనలో మైనంపల్లి ఉన్నట్టు సమాచారం.
మల్కాజిగిరిలో సంక్షేమ పథకాలు నిలిపివేత..!
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారుతున్నారనే ఉహాగానాలు ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మల్కాజిగిరి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేసినట్టు సమాచారం. బీసీబంధు, మైనార్టీ బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, దళితబంధు రెండో విడత దరఖాస్తుల సేకరణ ఇలా పథకాలన్నింటికీ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. సర్కార్, ఎమ్మెల్యే మధ్య వార్‌కు మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలు బలవుతున్నారు.