పిటిషన్‌కు నెంబర్‌ కేటాయించండి

– రిజిష్ట్రీకి జస్టిస్‌ లక్ష్మణ్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తప్పుడు చార్జిషీట్‌ దాఖలు చేసిం దంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం దాఖలు చేసిన పిటిషన్‌కు నెంబర్‌ కేటాయించాలని రిజిష్ట్రీకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఆదేశించారు. నెంబర్‌ కేటాయించేందుకు రిజిష్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. 2023, ఏప్రిల్‌ 29న సీఆర్‌పీసీ 161 కింద అజేయ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ విచారణాధికారి వికాస్‌కుమార్‌ రికార్డు చేశారు. అయితే చార్జిషీట్‌లో ముఖేశ్‌ శర్మ పేరుతో ఉంది. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా నమోదు చేశారని కల్లాం వాదన. దీనిపై దాఖలు చేసిన పిటిషన్‌కు రిజిష్ట్రీ నెంబర్‌ కేటాయించకపోవడంపై జరిగిన వాదనల తర్వాత న్యాయమూర్తి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌ను విచారిస్తామని చెప్పారు
మాకు బెయిలు ఇవ్వండి
వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా 5 నెలలు జైలులో ఉన్నామని, తమకు బెయిల్‌ ఇవ్వాలని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదరు కుమార్‌రెడ్డిలు హైకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్‌ పిటిషన్లను సత్వరమే పరిష్కరించాలని, తమ పిటిషన్లపై విచారణ పూర్తి చేసి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వారి పిటిషన్లను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది.
చెప్పకుండ వెళ్లినందుకే లుక్‌ఔట్‌ నోటీసులు
హైకోర్టులో ఏపీ సీఐడీ అధికారులు
మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నగదు మళ్లింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఎమ్‌డీ సీహెచ్‌ శైలజ దర్యాప్తు అధికారులకు ఏ సమాచారం లేకుండానే విదేశాలు వెళ్లిన కారణంగా ఆమె కోసం తాము లుక్‌ఔట్‌ నోటీస్‌ జారీ చేశామని ఏపీ సీఐడీ హైకోర్టుకు చెప్పారు. మార్చి 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పిందని, అయితే శైలజ చెప్పకుండా విదేశాలకు వెళ్లిన కారణంగా ఇచ్చిన లుక్‌ఔట్‌ నోటీసు కోర్టుధిక్కరణ కిందకు రాదని సీఐడీ చెప్పింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్‌ఔట్‌ నోటీసు ఇచ్చారంటూ మార్గదర్శి ఎమ్‌డీ శైలజ వేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్‌ సురేందర్‌ విచారించారు. విచారణకు ఏపీ సీఐడీ ఎఎస్పీలు రాజశేఖర్‌రావు, రవికుమార్‌ హాజరయ్యారు. అదనపు డీజీపీ ఎన్‌.సంజరు, ఏపీ హౌంశాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్‌ హాజరుకాలేదు. విచారణ సెప్టెంబర్‌ 15కు వాయిదా వేశారు.
ఆ ఉత్తర్వులు యథాతథం హైకోర్టు ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యులుగా కాత్యాయిని, రాజిరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును యథాతథంగా ఉంచాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. జీవో 23ను కె.సరిత సవాల్‌ చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ మాధవీదేవి విచారించి మధ్యంతర ఆదేశాలిచ్చారు. నియామక నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని పిటిషనర్‌ వాదన. విచారణ 31కి వాయిదా వేశారు.
కౌంటర్‌ దాఖలు చేయండి
శంషాబాద్‌ మున్సిపాలిటీ అధికారులకు హైకోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం సంగిగూడలోని వివిధ సర్వే నెంబర్లల్లో సుమారు 440 ఎకరాలు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌అరధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం విచారించింది. బి.మల్లేష్‌యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని శంషాబాద్‌ మున్సిపాలిటీ అధికారులను ఆదేశించింది. మున్సిపల్‌ అధికారులకు రెండు లేఖలు రాస్తే చర్యలు ల్లేవని, ఆఖరికి సీసీఎల్‌ఏ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని మార్చి నెలలో శంషాబాద్‌ మున్సిపాలిటీ, చిన్న గోల్కొండ పంచాయతీలను ఆదేశిస్తూ లేఖలు రాసినా ఫలితం లేదని పిటిషనర్‌ వాదన. విచారణ వచ్చే నెల 15కి వాయిదా వేశారు.