– మహాసభలో ప్రముఖుల ఆందోళన
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
దేశంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో కవులు, రచయితల ఐక్య సంఘటన అవసరమని అఖిల భారత అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పాలకుల ద్వారానే భారతదేశంలో ఫాసిజం అడుగుపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) రాష్ట్ర మూడవ మహాసభలు హైదరాబాద్ బొగ్గుల కుంటలోని డాక్టర్ సి.నారాయణరెడ్డి నగర్ సారస్వత పరిషత్తులో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత అరసం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శన శాలను జాతీయ ఇఫ్టా ఉపాధ్యక్షులు కందిమళ్ల ప్రతాపరెడ్డి ప్రారంభించారు. అనంతరం అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.రామారావు సభాధ్యక్షతన జరిగిన సభలో పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెగల మధ్య అల్లర్లు సృష్టించారని, మెజార్టీ తెగను ప్రభుత్వమే ప్రొత్సహిస్తోందని విమర్శించారు.
ఆ రాష్ట్రంలో అటవిక కార్యకలాపాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త లక్ష్యాల సాధన దిశగా సాంస్కృతిక ఉద్యమం సాగాలని స్పష్టంచేశారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాలకులు మారినా వారు వేసిన విష బీజాలను తొలగించేందుకు దశాబ్దాల కాలం పడుతుందన్నారు. వాటిని తొలగించడం సాంస్కృతిక ఉద్యమం ద్వారానే సాధ్యమన్నారు. దేశంలో ప్రజా సాంస్కృతిక పునఃనిర్మాణం అవసరమని, ఇందులో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ఉర్ధూ అరసం ఉపాధ్యక్షులు ఔదేశ్ రాణి మాట్లాడుతూ.. మనుషులను చంపాలని ఏ మతమూ చెప్పడం లేదని, కానీ మతం పేరుతో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మహిళపై దాడి జరిగితే మతంతో ముడిపెట్టకుండా ఒక మహిళగానే చూడాలన్నారు. అనంతరం ఆర్‌వీ రామారావు మాట్లాడుతూ.. జాతీయవాదం పేరుతో మతోన్మాదం వెయ్యి పడగలతో వచ్చిందన్నారు. సెక్యులర్, సోషలిస్టు పదాలు అధికారంలో ఉన్న వారికి కంపరంగా మారిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రచురితమైన పత్రికా ప్రకటనల్లోనే సెక్యులర్, సోషలిస్టు పదాలు కనిపించలేదని గుర్తు చేశారు. మానవత ప్రయోజనాల కోసమే అరసం ఏర్పడిందన్నారు.
కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతిశీల కళాకారులు, రచయితలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని స్పష్టంచేశారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ.. ప్రగతిశీలవాదులు, మతోన్మాదులగా రెండు వేర్వేరు దారులు ఉన్నాయని, ప్రజల వైపు ప్రశ్నించే గొంతుకలుగా అరసం నిలుస్తుందన్నారు. వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామికవాదులపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో అతిధులను అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ ఆహ్వానం పలకగా, అరసం రాష్ట్ర కార్యదర్శి డి.కమలారెడ్డి వందన సమర్పణ చేశారు. సభానంతరం కమలారెడ్డి రచించిన ”నా జ్ఞాపకాలు”, నాలేశ్వరం శంకరం రచించిన ”కవితా స్రవంతి” పుస్తకాలను కె.శ్రీనివాస్ పాటు అరసం నేతలు ఆవిష్కరించారు.