– నిద్రిస్తున్న రైతుపై నుంచి వెళ్లిన ట్రాక్టర్
– అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ – తిమ్మాపూర్
ధాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. వరి కుప్పలకు కాపలాగా పడుకున్న రైతు పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి మెండయ్య(60) తాను పండించిన ధాన్యాన్ని రెండ్రోజుల కిందట ఐకెపీ సెంటర్‌కు తీసుకొచ్చాడు. శనివారం వేకువ జామున 2 గంటలకు వడ్లను తూకం వేశారు. ఉదయం లోడింగ్ చేస్తామనడంతో మొండయ్య ఐకేపీ కేంద్రంలో బస్తాల పక్కనే నిద్రపోయాడు. తెల్లవారుజామున 3.30గంటల సమయంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ మిల్లుకు వెళ్లేందుకు డ్రైవర్ రివర్స్ తీశాడు. ఈ క్రమంలో అక్కడే పడుకున్న మొండయ్యపై తాడిపత్రి ఉండటంతో కనిపించక అతని పైనుంచి ట్రాక్టర్ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన మొండయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఎల్‌ఎండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైతు కుమార్తె రాయినిపట్ల లలిత ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ ఉప్పుులేటి పోచయ్య, యజమాని రాజు, ఐకేపీ ఇన్‌చార్జి మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి తెలిపారు.