యువతిపై దారుణం

యువతిపై దారుణం– కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి
– భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ క్వార్టర్స్‌లో ఘటన
ముంబయి : భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ క్వార్టర్స్‌లో కాలేజీ విద్యార్థిని(19)పై సామూహిక లైంగికదాడి జరిగింది. దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చెంబూర్‌ ప్రాంతంలోని పోస్టల్‌ కాలనీలోని భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) క్వార్టర్స్‌లోని ఒక ఫ్లాట్‌లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన ఈనెల 15-16 మధ్య రాత్రి 10 గంటల నుంచి 12.30 గంటల మధ్య చోటు చేసుకున్నది. కామర్స్‌ విద్యార్థిని అయిన బాధితురాలు ఆమె తల్లి, సోదరితో పాల్ఘర్‌ జిల్లాలో నివసిస్తున్నది. ఆమె బార్క్‌లో పనిచేస్తున్న తన తండ్రిని దగ్గరకు వచ్చింది. మునిసిపల్‌ హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లోని ఒక భవనంలో ఆమె తండ్రికి ఒక ఫ్లాట్‌ కేటాయించబడింది.
ఇద్దరు నిందితుల్లో ఒకరైన అజిత్‌ కుమార్‌ యాదవ్‌ (26) బార్క్‌లో పని చేస్తున్న ఒక ఉద్యోగి కుమారుడు. బాధితురాలి తండ్రి ఇంటికి సమీపంలోని ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజు అజిత్‌ తల్లిదండ్రులు రాత్రికి బయటకు వెళ్లారనీ, అతను తన స్నేహితుడు ప్రభాకర్‌ యాదవ్‌ (30)ని తన ఇంటికి ఆహ్వానించాడు.
అజిత్‌ ఇంటిలో నిందితులు యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం నిందితులిద్దరూ ఆమెపై దారుణానికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12:30 గంటలకు బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత తన ఫ్లాట్‌కు పరుగెత్తింది. ఆ తర్వాత అదే భవనంలో ఉంటున్న తన సన్నిహితులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఈనెల 16న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా నవంబర్‌ 20 వరకు పోలీసు కస్టడీ విధించారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.