ఆదివాసీ, దళిత అంగన్వాడీలపై దాడి దారుణం

Attack on Adivasi Dalit Anganwadis is brutal– పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలి
– ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్‌లకు అంగన్వాడీ జేఏసీ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీ, దళిత మహిళ అంగన్వాడీ ఉద్యోగుల పైన పోలీసులు దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి, కొట్టి గాయపర్చడం దారుణమనీ, ఘటనకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ జేఏసీ, తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ(సీఐటీయూ అనుబంధం)లు ఎస్సీ,ఎస్టీ, మహిళా కమిషన్‌లకు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ జేఏసీ నేతలు పి. జయలక్ష్మి (సీఐటీయూ), ఎన్‌. కరుణ కుమారి (ఏఐటీయూసీ), సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, కె ఈశ్వరరావులు ఉన్నారు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ.రమ, సభ్యులు ఎం.మీనా, ఎ.సునీత ఉన్నారు. ఆదివాసీ, దళిత మహిళలపై దాడి చేసిన ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ తదితరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులే దాడి చేసి అంగన్‌వాడీలే తమను కొట్టారని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆదిలాబాద్‌లో ఈ నెల 20న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అంగన్‌వాడీలు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మగపోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. తలమడుగు ఎస్‌ఐ ధనశ్రీ ఆదివాసీ, దళిత అంగన్‌వాడీలను పట్టుకుని గోండు, కొలాం లం.., బొడ్లు ముండలు, కల్లుతాగి ఇక్కడికి వచ్చారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ కులం పేరుతో దూషించారు. జుట్టు పట్టుకొని చీరలు ఊడిపోయేలా కొట్టారు. మిగిలిన పోలీసులు ఆమెను అనుసరించి చేతికి అందినవారిని అందినట్టు కొట్టారు. మగ పోలీసులు దుర్భాషలాడారు’ అని వివరించారు. ‘ఆ ఘటనలో మన్నూరు గ్రామానికి చెందిన కె.సులోచన గొంతుకు గాయాలయ్యాయి. సైదుపూర్‌ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కనక ప్రగతి(ఎస్టీ) పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయింది. మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రేమకుమారి(దళిత)ని ఎస్‌ఐ ధనశ్రీ జుట్టుపట్టుకుని కొట్టారు. నార్నూర్‌ గ్రామానికి చెందిన కె.పంచశీల, గుంజాలకు చెందిన జి.రేఖ ప్రధాన్‌, ఏ.జైశీల, మార్పగూడకు చెందిన కె.వత్సల, నడ్డగూడకు చెందిన టేకం సీతాబాయిలను పోలీసులు చెప్పలేని మాటలతో తిట్టారు. అంగన్‌వాడీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అయిన ధొనిపెల్లి వెంకటమ్మ, కామ సునీత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అయిన డి. సునీతలపై పోలీసులు దాడి చేశారు. వారి చీరలు లాగి అవమానపరిచారు. శాంతియుతంగా, చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన అంగన్‌వాడీ కార్యకర్తలను కులం పేరుతో దూషిస్తూ, బట్టలు ఊడిపోయేలా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.