– ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి
– నారాయణగూడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిరంతరం ఎండగడుతూ ప్రజలకు చేరువ చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై బీజేపీ ప్రభుత్వం దాడులను ఆపకపోతే ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి అన్నారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని ఢిల్లీ పోలీసులు క్రూరమైన ఉపా ఆరోపణలను ఉపయోగించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నారాయణగూడ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల ఇండ్లపై ‘రైడ్’ చేసి ల్యాప్‌టాప్ లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం స్థానం దిగజారడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నాలుగో స్తంభంగా సూచించబడే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పి అధికార అహంకారాన్ని దించుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, నాయకులు రమ్య, నాగేందర్, రమేష్, ప్రశాంత్, భారత్, చరణ్‌శ్రీ, శివ, శ్రీరామ్ పాల్గొన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడం హేయమైన చర్య అని.. పత్రిక స్వేచ్ఛపై కేంద్రం దాడిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.