విద్యార్థులకు ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు

– వారంరోజుల్లో అమలు చేసే అవకాశం
– ప్రత్యేక యాప్‌ రూపకల్పనలో విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఏఎస్‌) అమలు కానుంది. ఈ కొత్త విధానాన్ని వారం రోజుల్లో అమల్లోకి తేవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపకల్పన చేసే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగమయ్యారు. అయితే ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులందరికీ ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వారి మొబైల్‌ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా హాజరును విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రతి పీరియెడ్‌కు కాకుండా మొదటి పీరియెడ్‌కే ప్రస్తుతానికి ఈ హాజరును వర్తింపచేయనున్నారు. భవిష్యత్తులో అన్ని పీరియెడ్లకు వర్తించే అవకాశమున్నది. రాష్ట్రంలో 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35,952 మంది విద్యార్థులు చదువుతున్నారు.