29న హైదరాబాద్‌లో ఆటిజంపై అవగాహన

Autism awareness in Hyderabad on 29thనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆటిజం, తలసేమియా, ట్రాన్స్‌జెండర్ల కోసం పనిచేస్తున్నమార్హం-రెసొనేటింగ్‌ రెసిలెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 29న ‘స్పెక్ట్రమ్‌ స్పార్కిల్‌’ పేరుతో తొలిసారిగా ఆటిజం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆటిజం రోగనిర్ధారణ, పిల్లల ఆలస్యమైన భావోద్వేగ అభివృద్ధి, సంపూర్ణ నిర్వహణపై లోతైన, అత్యంత కీలకమైన విషయాలను ఈ కార్యక్రమం అందించనుంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డెక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ , సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ మిన్‌హజ్‌ జాఫర్‌ నాసిరాబాడి, నిలోఫర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.ఉషా రాణి, రోష్ని కౌన్సెలింగ్‌ సెంటర్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ జయంతి సుందర్‌ రాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటిజం అవగాహనపై రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ – గుంజాయిష్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మార్హం వ్యవస్థాపకులు డాక్టర్‌ నబత్‌ లఖానీ మాట్లాడుతూ స్పెక్ట్రమ్‌ స్పార్కిల్‌ అనేది రోగనిర్ధారణ, చికిత్సలు, సమగ్ర విద్య, ఉపాధి, భవిష్యత్తుపై ప్రత్యేక నిపుణుల ప్యానెల్‌ చర్చల సమ్మేళనం. ఆటిస్టిక్‌ ప్రతిభావంతులను, వారి కుటుంబాలను అభినందిస్తూ తీసిన లఘు చిత్రం – గుంజాయిష్‌ ప్రదర్శన కూడా ఉంటుందని చెప్పారు. ఆటిజంతో బాధితుల ప్రత్యేక సామర్థ్యాలు, వారి కృషిని కూడా హైలైట్‌ చేయనున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులకు ఆటిజం గురించి ప్రఖ్యాత నిపుణుల బృందం నుంచి విలువైన సమాచారం అందించడంతో పాటు సమాజానికి ఆటిజం గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. పిల్లల్లో ఆలస్యమైన అభివ ృద్ధి సంకేతాలను గుర్తించడం నుంచి రోగనిర్ధారణ ప్రక్రియ, ఆటిజం సంపూర్ణ నిర్వహణ వరకు ప్రతీ సమాచారాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో శిశు వైద్యులు, సైకాలజిస్టులు, ప్రత్యేక అధ్యాపకులు, ఆటిజం న్యాయవాదులతో సహా ఈ రంగంలోని నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రతిభావంతులైన ఆటిస్టిక్‌ పిల్లలందరికీ రాష్ట్ర గవర్నర్‌ ఈ అవార్డులను అందజేస్తారు.