గిరిజనులపై మతోన్మాద దాడులను అరికట్టాలి : ఆవాజ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మణిపూర్‌లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై విచ్చట విడిగా దాడులు జరుగుతుంటే..కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నదని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ ఆవేదన చేశారు. వాటిని వెంటనే ఆపాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాడులకు పాల్పడుతున్న మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో గత రెండు మాసాలుగా కుకీ,నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్రంలో, మణిపూర్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఆ దాడులను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. అక్కడి ఆదివాసీ గిరిజనులపై బీజేపీ అండతో జరుగుతున్న జాతిఉన్మాద, మతోన్మాద దాడులను ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని కోరారు.