నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్‌కు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో 2020-21 ఏడాదికిగానూ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకుకు ప్రథమ బహుమతి, 2021-22 సంవత్సరానికిగాను ద్వితీయ బహుమతితో పాటు సహకార శిక్షణ సంస్థల విభాగంల బ్యాంక్ శిక్షణ సంస్థకు 2020-21, 2021-22 సంవత్సరాలకు ప్రథమ బహుమతులను రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమైఖ్య (ముంబై) ప్రకటించింది. అదే విధంగా దేశంలోని 351 జిల్లా సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకుకు ఉత్తమ పురస్కారం, దేశంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో చొప్పదండి సంఘానికి ప్రథమ బహుమతి లభించింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ పాలకవర్గ సభ్యులు ప్రెసిడెంట్ కొండూరు రవీందర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నేతి మురళీధర్ నాయకత్వంలో ఉత్తమ సేవలు అందిస్తున్నామని ప్రజా సంబంధాల విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తెలిపారు. అవార్డులను సెప్టెంబర్ 26న రాజస్థాన్ రాజధాని జైపూర్ ప్రదాన చేయనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.