నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్ : పట్టణంలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం ఓటు హక్కు పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పెద్దపల్లి ఆర్డీవో మధుమోహన్, ఎమ్మార్వో రాజ్ కుమార్, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రౌఫ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారజ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అందరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ఫామ్ 06 ద్వారా నమోదు చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు గురించి తెలుసుకోవాలని, ఓటు చాలా విలువైనది అని అన్నారు.కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని,దేశంలో ప్రజల ఓటు అతిపెద్ద ఆయుధం అని అన్నారు.డబ్బుకు, మద్యానికి, బహుమతులకు లొంగకుండా సరైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. యువత క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్రాన్ని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే గొప్ప శక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే. రవీందర్, లెక్చరర్స్ పాల్గొన్నారు.