ఎన్‌సీపీ తిరుగుబాటులో ‘బాహుబలి’ పోస్టర్లు..

ముంబయి: ఎన్‌సీపీపై పట్టు నిలబెట్టుకునేందుకు అటు శరద్‌ పవార్‌, ఇటు అజిత్‌ పవార్‌ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అజిత్‌ పవార్‌ తిరుగు బాటును ఉద్దేశిస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. వాటిలో జూనియర్‌ పవార్‌ను ద్రోహి అని అభివర్ణించారు. ఇలాంటి వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని విమర్శించారు. ఢిల్లీలోని శరద్‌ పవార్‌ ఇంటి వెలుపల ఈ పోస్టర్లను ఏర్పాటుచేశారు. ‘మన మధ్యలోనే ఉన్న ద్రోహులను దేశం మొత్తం చూస్తోంది. వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని సీనియర్‌ పవార్‌ వర్గం విమర్శలు గుప్పించింది. అలాగే పోస్టర్లపై తెలుగు బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రచురించింది. బాహుబలిని కట్టప్ప వెనక నుంచి కత్తితో పొడిచే దశ్యమది. అయితే కట్టప్ప స్థానంలో అజిత్‌ పవార్‌, బాహుబలి స్థానంలో శరద్‌ పవార్‌ ఫొటోలను ఉంచారు. అత్యంత ఆత్మీయంగా మెలిగిన వ్యక్తే వెన్నుపోటు పొడిచారనేది దీని సారాంశంగా కనిపిస్తోంది. ఎన్‌సీపీ విద్యార్థి విభాగం దీనిని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ‘(ద్రోహి)’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో దీనిని ప్రస్తావించారు.