బాల గేయాల పెద్దయ్య చండూరు కవి

బాల గేయాల పెద్దయ్య చండూరు కవిదక్షణ తెలంగాణ లోని ఉద్యమాల కార్యక్షేత్రాల్లో ఒకటైన నల్లగొండ జిల్లా నుండి మలి తరంలో బాల సాహిత్యకారులు కొంత మందే మనకు కనిపిస్తున్నారు. కానీ నేటి తరంలో మాత్రం అనేక మంది పోటీ పడి రాస్తున్నారు. కీర్తిశేషులు బి.ఎన్‌.శాస్త్రి, బోయ జంగయ్య. పెండెం జగదీశ్వర్‌ వంటి వాళ్ళు మూడు తరాల ప్రతినిధుల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అయితే నల్లగొండ జిల్లా మలితరం బాల సాహితీవేత్తల్లో పుస్తకం అచ్చువేసుకున్నా ప్రచారానికి దూరంగా ఉన్న వారిలో శ్రీ రావిరాల వీరయ్య ఒకరు.
నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన శ్రీ రావిరాల వీరయ్య 4 మే, 1944న జన్మించారు. శ్రీమతి రావిరాల మారమ్మ, శ్రీ కాశప్ప వీరి తల్లితండ్రులు. మొదట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వ బాలుర కళాశాల, నల్లగొండలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ పొంది, ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. పద్యం, గేయం, కవిత్వాన్ని అత్యంత ప్రతిభావంతంగా రాసిన రావిరాల వీరయ్య గేయానికి పెట్టింది పేరు. ఎనభై, తొమ్మిదవ దశకం తొలి నాళ్ళ నుండి విరివిగా రాసినప్పటికి అచ్చులోకి మాత్రం రెండు మూడు పుస్తకాలు మాత్రమే రావడం వల్ల నేటి తరానికి వీరి పేరు తెలియకపోవడంలో ఆశ్చర్యంలేదు. ఇటీవలి పరిశోధనలో నాకు దొరికిన ఆణిముత్యాల్లో ఈ గేయాల సాలీడు ఒకరు. ఈయన పద్యాల, గేయాల కలనేత నేతన్న నేతంత అందంగా, అంతే సుందరంగా ఉండడం వీరి రచనలోని ప్రత్యేకత.
సాహితీ మేఖలను, అంబడిపూడి వేంకటరత్నం గారిని విడివిడిగా చూడలేం. నల్లగొండ నేల మీద ఆయన ప్రభావం గొప్పది. కవి రావిరాల వీరయ్య కూడా వీరి ఆశీస్సులను అందుకుని కవిగా నిలిచారు. వారి మాటల్లో రావిరాల వీరయ్య గేయాల గురించి చెప్పాలంటే… ”బాలబాలికల హృదయాలకు ఈనాడు అందింపవలసిన ఆదర్శ శీర్శికలను ఎన్నుకొని సరళమైన భాషలో గేయాలుగా రచించినట్టు కన్పడుతున్నది. దేశభక్తి, జన్మభూమాతృ స్వరూప సందర్శనము, ఆ సేతు హిమాచలము భావనచేసి శిశుదృష్టి కందించినాడు. ఆచార్యుడుగా తన శిష్యకోటిని పౌరులుగా తయారుచేయుట అను లక్ష్యముతో సాగిన ఈ రచన హృద్యంగా, భావపూర్ణంగా, కాలానికి అనుకూలంగా వుండి అందరను ఆకర్శించుచున్నది.”
ఇది నిజం. అంబడిపూడి చెప్పినట్టు నేటి కాలానికి కూడా ఈ బాల గేయాలు స్పూర్తిని, చైతన్యాన్ని, మార్గదర్శనాన్ని చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. గేయాలే కాక పద్యాలు కూడా రాశారు. సాహితీ మేఖల సంచికల్లో వీరి రచనలు అచ్చయ్యాయి. వీరి తొలి గేయాల పుస్తకం ‘ప్రబోధ మంజరి’. ఇది అంబడిపూడి చెప్పిన అన్ని లక్షణాల గేయ సంపుటి.
‘నేటి బాలలే/ రేపటి పౌరులు/ నేటి మొక్కలే/ రేపటి మ్రానులు/ మొక్క వంగనిదె/ మ్రానై వంగదు/ నేడు లేనిదే/ రేపిక రాదు’ అంటారు రావిరాల వీరయ్య. ఇంత సరళంగా, సూటిగా, సామెతల మాల కట్టి చెప్పడం మరొకరికి సాధ్యం కాదేమో అని అని పిస్తుంది వీరి గేయాలు చదివితే. ఇంకా … ‘బాల్యం దున్నిన/ నేల వంటిది’ అని అందులో మనం మంచి విత్తనాలు వేస్తే అంతకు మించిన మంచి పంట వస్తుందంటారు వీరు. రావిరాల గేయాలన్నీ చక్కని లయ, తూగూ కలిగి ఉండడం వల్ల ఒక్కసారి చదివితే గుర్తుండిపోతాయి. అందుకు ఉదాహరణగా చూద్దాం, ”చిట్టి పాపలం/ చిన్ని పాపలం/ చల్లనైన భరతమాత/ కన్న పాపలం’, ఇంకా ‘తప్పులేవో/ ఒప్పులేవో తలప నేరము… ” అంటూ అందంగా సాగుతాయి. బాలలకు చిన్నప్పటి నుండే సుద్దులు, బుద్దులు చెప్పాలని తలచిన వారు ఎన్ని అంశాలను చెప్పారో… అటువంటిదే మరో గేయం చూద్దాం. ”ఒకరి భూమి మనకొద్దు/ ఒకరి సొత్తు మనకొద్దు” అంటారు. ఇంకా పిల్లల కర్తవ్యాన్ని చెబుతూ… ”దేశ రక్షణే మన కర్తవ్యం/ దేశాభ్యుదయం మన భవితవ్యం” అంటూనే దేశమంటే ఎవరో కాదు, ”దేశమన్న మన మందరమేరా / దేశ రక్షణ మన రక్షణరా” అని చెబుతారు. దేశ నాయకుల గురించి, దేశభక్తి గురించి వీరయ్య రాసిన గేయాల గురించి అంబడిపూడి గొప్పగా చెబుతారు తన మాటల్లో. వీరి గేయాలు కూడా అట్లానే ఉంటాయి.. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ గురించి చెబుతూ- ”లోక మాన్యుడు- బాల ధన్యుడు/ తిలక్‌ మాన్యుడేమన్నాడు… స్వరాజ్యమే నా జన్మహక్కని సింహలా గర్జించాడు” అని చెబుతారు. అలాగే ”శాంత్యహింసలే- సాధనంబులని/ సకల దిశల చాటాడు” అంటూ గాంధీ గురించి, ”వీర యోధుడు విక్రమార్కుడు” అంటూ నేతాజీ సుభాష్‌ బోస్‌ గురించి తన గేయాల్లో అద్భుతంగా వర్ణిస్తారు. గేయాన్ని అత్యంత ప్రతిభావంతంగా రాసిన రావిరాల వీరయ్య ఒక్క పుస్తకంతోనే ఆగిపోవడం తెలుగు బాలలకు పెద్ద లోటు. వారి కలం నుండి మరో మంచి బాల గేయాల సంపుటి కోసం చూస్తూ… జయహో!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548