ఉత్సవం అంటేనే ఉత్సాహంగా గడపడం. ఈ మధ్యన చాలా చోట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాలోత్సవాలు జరిగాయి. వేల సంఖ్యల్లో బాలలు ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం రొడ్డకొట్టుడు బట్టీ చదువుల మధ్య ఈ బాలోత్సవాలు పిల్లలకు ఓ గొప్ప ఆటవిడుపు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
చిత్రలేఖనం (బొమ్మలు గీయడం), కథ రాయడం, చెప్పడం, వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్, నాట్యం (శాస్త్రీయ, జానపద), సంగీతం (పాటలు), స్కిట్స్ (లఘునాటికలు), ఏకపాత్రాభినయం (మోనోయాక్షన్), ఫ్యాన్సీడ్రస్ (విచిత్ర వేషధారణ), సైన్స్ ప్రయోగాలు, వ్యర్ధం నుండి అర్ధం (బెస్ట్ ఫ్రం వేస్ట్), క్రాఫ్ట్స్, మట్టి బొమ్మల తయారీ, కోలాటం, బతుకమ్మ ఆట… ఇలా అనేకం ఆ ఉత్సవాల్లో పోటీ అంశాలుగా చోటు చేసుకున్నాయి. ఎందులో ఆసక్తి వున్నవారు అందులో పోటీపడతారు.
నాట్యం, కళలకు సంబంధించి రకరకాల అలంకరణలతో, ఆహార్యాలతో (మేకప్) పిల్లలు అందంగా, ఆనందంగా ఆ వాతావరణంలో తారట్లాడడం పిల్లలకే కాదు పెద్దలకూ ఎంతో ముచ్చట కొల్పుతుంది. ఎందుకంటే ఆ అంశాలన్నీ ఒకే ఆవరణంలో ఎక్కడికక్కడ సమాంతరంగా కోలాహలంగా చోటు చేసుకుంటాయి మరి! ఈ బాలోత్సవాలన్నింటికీ, డా||వాసిరెడ్డి రమేష్‌బాబు సారథ్యంలో గత పాతికేళ్లుగా నడిచిన కొత్తగూడెం బాలోత్సవ్ ప్రేరణ అని చెప్పక తప్పదు. ఆ తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో కాకినాడ ‘క్రియ పిల్లల పండుగ’ జరుగుతున్నది.
కానీ ఈ బాలోత్సవాల్లో దాదాపు 80-90 శాతం మంది ప్రైవేటు విద్యాసంస్థల బాలలే పాల్గొంటున్నారు. తమ పిల్లలకు ఒక ఎక్స్‌పోజర్ విజిట్‌గా బాగుంటుందనే ఉద్దేశంతో యాజమాన్యాల వారు బస్‌లతో సహా మరీ తీసుకువస్తారు. అవి వారి వారి పాఠశాలల గుర్తింపుకు, ప్రమోషన్స్‌కు ఉపయోగపడుతున్నాయి. విజేతలైన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఇక చెప్పేదేముంది? చెప్పలేని ఆనందం.
కానీ ఈ బాలోత్సవాలకు ప్రభుత్వ పాఠశాలల బాలలు దూరం కావడం ఓ విషాదం. కారణం ఈ బాలోత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం అంతగా సహకరించకపోవడం లేదా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, బాలోత్సవాల్లో తమ పిల్లలు పాల్గొనేలా వ్యయప్రయాసలకోర్చి బాధ్యత తీసుకోకపోవడం. ఇది ఐచ్ఛికమే తప్ప నిర్బంధం కాదు. అందువల్ల సర్కారు బడుల పిల్లలు ఈ బాలోత్సవాల్లో పాల్గొనే హక్కును, అవకాశాన్ని కోల్పోతున్నారు.
కాగా, ఎప్పుడైతే పోటీ ప్రవేశిస్తుందో అక్కడ ఒక్కోసారి అక్రమాలు చోటు చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది. తమ పిల్లలకే బహుమతులు రావాలనే ఆశతో పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలపై అవాంఛనీయ ఒత్తిడి తెస్తుంటారు. బహుమతుల మీద దుగ్దతో న్యాయనిర్ణేతలను ప్రభావితం చేయడం, లాలూచీ పడటం మొదలైన అక్రమాలు జరుగుతాయి. పిల్లలు అన్యాయమైపోతారు అప్పుడు.
శాస్త్రీయ సంగీతంతో పాటు, నృత్యాలలోని భావం అటు పిల్లలకు గానీ, ఇటు నేర్పిన గురువులకు గాని, న్యాయ నిర్ణేతలకు గానీ చాలాసార్లు తెలియవు. ఎందుకంటే అవి గతం నుండి సంస్కృత పదబంధాలతోనూ, భక్తి మార్గంలోనూ వుండటమే. వాడుక భాష కాదు. ముచ్చటైన ఆహార్యం, లయాత్మకమైన నృత్యం ఒక ఆకర్షణ. అంతే. తాము ఆ నృత్యం ఎందుకు చేస్తున్నామో, దాని భావమేమిటో చేసే పిల్లలకు, చూసే ప్రేక్షకులకు తెలియదు. ఫలితం పాక్షికమే. డి.జె.సౌండ్‌ల హోరులో రికార్డింగ్ జానపద నృత్యాల జోరు జనాన్ని ఉర్రూతలూగించవచ్చు. వ్యక్తిత్వ వికాసానికి అలాంటి కళ ఎలాంటి బాటలు పరుస్తాయన్నది ప్రశ్నార్ధకమే. ఆ కళకు – జీవితానికి గత సంబంధం – నిర్వాహకులు, గురువులు, న్యాయనిర్ణేతలు ఎవరూ చెప్పకపోవడంతో ఆ పోటీ ఒక యాంత్రికంగా జరిగిపోతుంది.
కథ, కవిత్వం, పాట, పద్యం, ఆట, అభినయం మొదలైన కళాంశాలు ప్రతిదాని గురించి పిల్లలకు చక్కగా విశదపరచాలి. ఆసక్తిని రేకెత్తించాలి. తమ వ్యక్తిత్వ ఎదుగుదలకు, తద్వారా సామాజిక మార్పుకు ఎలా దోహదపడతాయో సరళంగా చెప్పాలి. అవి అర్ధమయినప్పుడు పిల్లలు ఆయా రంగాల్లో పాల్గొనే తీరే వేరుగా వుంటుంది. సహజమైన ఇంద్రియ స్పర్శ, సృజనశీలత కోల్పోతే పిల్లల్లో మిగిలేది యాంత్రిక తత్వమే. బట్టీపరీక్షల యంత్రం నుండి బాలోత్సవ్ యంత్రంలోకి మరల పిల్లలు ప్రవేశించడం లేదుకదా అనే భయం ఇప్పుడు తొంగి చూస్తున్నది.
బాలలకు బాలోత్సవాల పేరిట ఈ మాత్రమైనా ఆటవిడుపు ఇచ్చి, వారి వృద్ధికి తోడ్పడుతున్నామనే భావనలో కొంతమంది నిర్వాహకులు ఉంటున్నారు. నిజమే. కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశంలో నలభైకోట్ల మందికి పైగా పిల్లలు బడి ఈడు పిల్లలనే విషయం మనం మరువరాదు. కనుకనే పిల్లలు ఎక్కడబడితే అక్కడ పుట్ట పగిలిన చీమల్లా కనిపి స్తున్నారు. మరో పదేళ్ల వరకు ఇదే పరిస్థితి. వారి సమగ్ర వికాసానికి సంబంధించిన శాస్త్రీయ ప్రణాళికలు, కార్యాచరణ ప్రభుత్వాల వద్ద కొరవడుతున్నాయి. ఇలాంటి ఉత్సవాలు ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా జరగాలని, అందుకు పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, విద్యాశాఖ సమిష్టిగా కృషి చేయాలని, ఇది పిల్లల వికాసం కోసం నిర్వహించవలసిన ఓ సామాజిక, రాజకీయ కర్తవ్యమని చాలామంది గుర్తెరగటం లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987లో ప్రప్రధమంగా భారత జనవిజ్ఞాన యాత్ర జరిగింది. దేశం కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్ అనే లక్ష్యాలతో కళాజాతాలు నడిచాయి. పాఠశాలల, కళాశాల విద్యార్థులతో పాటు సామాన్య జనంలో కూడా సైన్స్ విషయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఆ స్ఫూర్తితో తర్వాత జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు 1988, అక్షర కళాయాత్రలు – 1990 నడిచాయి. ఆ దశాబ్దంలో జరిగిన సాక్షరతా ఉద్యమంలో లక్షలాది మంది వయోజనులు అక్షరాస్యులు అయ్యారు. చదువుకునే పాఠశాల, కళాశాల విద్యార్థులే పెద్దలకు గురువులుగా మారారు. అదో ఉద్యమం. కొనసాగింపుగా సారా వ్యతిరేక ఉద్యమం, మహిళా చైతన్యకళాయాత్రలు, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణా యాత్రలు, నీరు – పారిశుధ్యం కళాయాత్రలు, పొదుపు ఉద్యమం… ఇలా ఎన్నో వచ్చాయి. ఇవన్నీ సామాజిక ఉద్యమాలే.
అదిగో ఆ సందర్భంలోనే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ త్రిచూర్‌లో పెద్ద ఎత్తున బాలోత్సవ్ – 88 నిర్వహించింది. వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలనుండి బాలలను ఆహ్వానించారు. ఆ బాలలందరికీ స్థానిక బాలలే ఆతిధ్యం ఇచ్చారు. తమ ఇండ్లకు సాదరంగా తోడ్కొని పోయి భోజన వసతి సదుపాయాలు కల్పించారు. భాష తెలియకపోయినా ఆ బాలలు ఆ ఇళ్లల్లో ఒక బాలునిగా, ఓ బాలికగా పెద్దల నుండి ఎంతో ప్రేమను, ఆప్యాయతను పొందగలిగారు. భిన్న భాషా సంస్కృతులైనా అంతరంగాల మమతానురాగాలు వారికర్థమయ్యాయి. చిన్నతనంలో చిగురించిన ఆ మధుర భావనను వారు జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేరు. జాతి, మత, కుల, భాష, ప్రాంతాలకు అతీతమైన స్నేహ భావన అది. రాత్రుళ్లు అలా ఇళ్లల్లో బస చేసిన బాలలకు పగలు బాలోత్సవ్ పందిళ్లల్లో రకరకాల కార్నర్‌లు. అసలు ఆ వాతావరణమే గడ్డి, కొబ్బరి ఆకులు, మట్టలతో, పువ్వులతో, ఆకులతో రకరకాల ప్రకృతి ఆకృతితో శోభిల్లింది. పోటీలు లేవు. ఎవరికి ఇష్టమైన కార్నర్‌కు వారు స్వేచ్ఛగా వెళ్లి నేర్చుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలు, లెక్కలు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, సాహిత్యం, స్టోరీనెరేషన్ (కథ చెప్పడం), క్రాఫ్ట్ వర్క్, కవిత్వ పఠనం (రిసైటేషన్), పెయింటింగ్ (చిత్రలేఖనం), థియేటర్ (రంగస్థలం), పర్యావరణహితం (ఎకోఫ్రెండ్‌షిప్), సేవ్ ఎనర్జీ (ఇంధన పొదుపు), మానవ పరిణామం (పోస్టర్ డిజైన్), ఆరోగ్య రక్షణ – రక్తదానం (బాడీ చెకప్ – బ్లడ్ డొనేషన్), పప్పెట్రీ (బొమ్మల తయారీ), మత్తు మాదక ద్రవ్యాల నివారణ స్లైడ్‌షో తయారీ… ఇలాంటివి ఎన్నో విషయాలు అనుభవ సహితంగా తెలపడం, ఆ పరికరాల తయారీలో వారినే భాగస్వాములను కావించడం (లెర్నింగ్ బై డూయింగ్) చక్కగా నేర్పించారు. ఆ తర్వాత ఇండ్లకు వెళ్లి తమ కిట్‌లను తామే సొంతంగా తయారు చేసుకునేవారు. గాఢమైన అనుభూతి, తదనుగుణమైన అభివ్యక్తీకరణ ఆ పిల్లల్లో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కన్పించేది. తాము తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలనే తహతహ పిల్లలకు సహజంగానే వుంటుంది. వారి సృజనశీలతకు పదును పెట్టడం అంటే ఇదేగా. ఆ బాలోత్సవ్‌లో పాల్గొన్నవారు ఆ తర్వాత ఎందరో డాక్టర్లు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలై సైన్స్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అలాగే హైదరాబాద్‌లో అలాంటి బాలోత్సవ్ నమూనా కూడా జరిగింది. ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన బాలలకు మన పిల్లలు ఇక్కడ ఇండ్లల్లో ఆతిథ్యమిచ్చారు. కార్నర్లు నడిచాయి. నిపుణులు విషయాలు బోధించారు. ముఖ్యంగా చెప్పొచ్చేదేమిటంటే ఈ బాలోత్సవాల్లో పోటీలు లేవు. పిల్లలందరి భాగస్వామ్యానికి, వికాసానికి, సృజన శీలతకు, కార్యాచరణకు అగ్రతాంబూలం ఇవ్వడం!
కొంచెం దగ్గర దగ్గరగా ఇలాంటి బాలోత్సవాలు పలుచోట్ల ఇప్పుడు జరుగుతున్నాయి. ఎ.పి. కుంచనపల్లి గ్రామం వద్దనున్న అరవింద పాఠశాల ప్రతి ఏడాది సాహేస్ సొసైటీ ఫర్ అడ్వాన్స్‌డ్ హొలియిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో విభిన్న పాఠశాల విద్యార్థులకు, ఉపాద్యాయులకు వారంతట వారు భాగస్వామ్యమై నేర్చుకునేలా శిక్షణనిస్తుంది. ‘ఇంటెన్సివ్’ల పేరుతో నడుస్తాయి. వీటిలో వంట చేయడం, పాడి పంటల ఇంటెన్సివ్‌లూ కూడా వుంటాయి. అలాగే పాఠశాల విద్యాబోధనలో, శిక్షణలో ఉపాద్యాయులకు ఎదురయ్యే నూతన సవాళ్ల గురించి పరిష్కార దిశగా సమాలోచనలు జరుగుతాయి. స్టెప్ (స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్స్) పేరుతో పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులను ఎలా భాగస్వామ్యం చేయాలో కూడా చర్చిస్తాయి. వాటిని పాటించడం వలన ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో కూడా విశదపరుస్తాయి. పిల్లలు ఎక్కడికక్కడ వేరుపడకుండా సమిష్టితత్వంలోకి తీసుకువచ్చే మార్గమిది. ఆలోచన, ఆచరణ కలబోసుకునే దారి ఇది.
అలాగే ‘అస్వ’ అనే ఒక సంస్థ ఇటీవల రైతు బజార్ మాదిరి ‘బాల బజార్’ నిర్వహించి, వారిలో ఆర్థిక, సామాజిక చైతన్యం కల్పించేందుకు కృషి చేసింది. పిల్లలు దుకాణాల యజమానులు. తల్లిదండ్రులు కొనుగోలుదారులు. ఫుడ్ వితౌట్ ఫైర్‌తో రకరకాల పదార్థాలు తయారు చేసి పిల్లలను, పెద్దలను జంక్‌ఫుడ్, కూల్ డ్రింక్స్, కుర్‌కురేల నుండి దూరం చేశారు. ఇదో ప్రయోగం.
అలాగే బాలసాహితీవేత్తలు పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్, వి.ఆర్.శర్మ వంటి వారి ఆధ్వర్యంలో పిల్లల్లో పెద్ద ఎత్తున క్రియేటివ్ రైటింగ్ (సృజనాత్మక రచనలు) వర్క్‌షాప్‌లు జరుగుతున్నాయి. తద్వారా వారిలో భాషానైపుణ్యాలతో పాటు చిన్నప్పటి నుండే సాహిత్యం ద్వారా ప్రపంచాన్ని అర్ధం చేసుకునే నైపుణ్యం అలవడుతున్నది.
అలాగే సి.ఎ.ప్రసాద్, జాస్తి శివ ల ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరు వెంకటేశ్వర బాల కుటీర్ వేదికగా షీరోస్ (చారిత్రక, సమకాలీన భారత నిజ కథానాయిలు) 256 మంది ఆ కథానాయికల వేషధారణ వేసారు. వారి గురించి సమాచారాలు ఎవరికి వారే సేకరించుకుని అభినయించడం ఎంతో గొప్ప ఉత్సాహాన్ని ఆ పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ రేకెత్తింది. ఇవన్నీ బాలల వికాసంకై బాలోత్సవాల్లో జరిగే కొత్త పుంతలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కదా నిజమైన చదువు అనే విషయం బోధపడింది.
– కె.శాంతారావు, 9959745723