– బీమా సంస్థలు తెరిచి ఉంటాయి
– నేడు పనిదినమే..
– రెగ్యూలేటరీ సంస్థల ఉత్తర్వులు
ముంబయి : ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకులు, బీమా సంస్థలు, పన్ను సంబంధిత కార్యాలయాల విభాగాలు పని చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. 2023-24 ముగింపు నేపథ్యంలో శనివారం, ఆదివారం కూడా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు, శాఖలు తెరుచుకుని ఉండేలా రెగ్యూలేటరీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ లావాదేవీలకు, ఇతరత్రా చెల్లింపులకు, ట్యాక్స్ చెల్లింపులకు ఆటంకం లేకుండా ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని 33 బ్యాంక్‌లు పని చేసేలా ఆర్‌బిఐ ఉత్తర్వులు జారీ చేసింది. నెఫ్ట్, ఆర్‌టిజిఎస్‌తో పాటు చెక్ క్లియరెన్సులు తదితర సేవలు యథాతథంగా కొనసాగుతాయి. వీటితో పాటు స్పెషల్ డిపాజిట్ స్కీమ్, పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో డిపాజిట్లను స్వీకరిస్తారు. అయితే బ్యాంక్‌ల్లో సాధారణ సేవలు అందుబాటులో ఉంటాయా..? లేదా అనేది స్పష్టం చేయలేదు.
2023-24లోనే ప్రభుత్వ లావాదేవీలు జరిగినట్లుగా వివరాలు లెక్కలోకి రావాలన్నదే దీని వెనక ప్రధాన ఉద్దేశ్యమని ఆర్‌బిఐ పేర్కొంది. ఆర్‌బిఐ తరహాలోనే ఇన్య్సూరెన్స్ రెగ్యూలేటరీ సంస్థ ఐఆర్‌డిఎఐ సైతం బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్చి 30, 31న కార్యాలయాలు తెరిచి ఉంచాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. మరోవైపు పన్ను సంబంధిత కార్యకలాపాలను పూర్తి చేసేందుకు మార్చి 30, 31న తమ శాఖలన్నీ పని చేస్తాయని ఆదాయ పన్ను విభాగం ఇటీవలే స్పష్టం చేసింది. కాగా.. ఏప్రిల్ 1న మాత్రం రూ.2వేల నోట్ల మార్పిడిని నిలిపివేస్తున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది.