బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల

– జూన్‌ 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 26న విడుదల
నవతెలంగాణ-బాసర
రాష్ట్రంలోని ఏకైక సమీకృత ఇంజినీరింగ్‌, ఆరు సంవత్సరాల బీటెక్‌ విద్య అభ్యసించడానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను బుధవారం ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో బాసర ఆర్జీయూకేటి యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు యూనివర్సిటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ వెల్లడించారు. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 85 శాతం వరకు అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో, మీ సేవ, ఈ సేవ సెంటర్‌ ద్వారా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు జూన్‌ 5 నుంచి 19 జూన్‌ వరకు దరఖాస్తులకు గడుపు ఉందని తెలిపారు. ఎన్‌సీసీ, పీహెచ్‌సీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు జూన్‌ 24 వరకు గడువు ఉందన్నారు. ఆర్జియూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్‌ 26న ఆర్జీయూకేటి వెబ్‌సైట్లో, విద్యార్థుల మొబైల్‌ పోన్‌లకు మెసేజ్‌ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మొత్తం 1605 సీట్లను భర్తీ చేస్తామని, ఇందులో 1404 సీట్లు జనరల్‌, 96 స్పెషల్‌ కేటగిరి, 105 గ్లోబల్‌ కేటగిరి సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. ఓసి, బిసిలకు అప్లికేషన్‌ ఫీజు రూ.500, ఎస్‌టి, ఎస్‌సిలకు రూ.450, గ్లోబల్‌ కేటగిరి వారికి రూ.1500 ఉంటుందన్నారు. ఏదైన సమాచారం కావాలంటే విద్యార్థులు ఆర్జీయూకేటీ బాసర వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలని లేదా 7416002245, 7416058245, 7416122245 సెల్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. యూనివర్సిటీలో మిగిలిపోయిన బీటెక్‌లో ప్రవేశాల కోసం త్వరలో విధివిధానాలు రూపొందించి వివరాలు వెల్లడిస్తామని వీసీ తెలిపారు. సమావేశంలో అడ్మిషన్స్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌రావు, కో ఆర్డినేటర్‌ పావని, దత్తు, టెక్నికల్‌ టీం సభ్యులు పాల్గొన్నారు.