తొమ్మిదిరోజుల బతుకమ్మా పై
అమ్మను కొలిచే బతుకమ్మా
అమ్మా అత్తా అక్కా చెల్లీ
ఆడుతుపాడే బతుకమ్మా
తంగెడు పూవుల బతుకమ్మా
అంగడి పూవుల బతుకమ్మా
బంగరు బంతులు చేమంతులతో
సింగిడి రంగుల బతుకమ్మా
గుమ్మడి పువ్వుల బతుకమ్మా
గునుగు గుత్తులా బతుకమ్మా
పళ్లెం నిండా పువ్వులు పేర్చే
ప్రకతి పండుగ బతుకమ్మా
పువ్వుల పండుగ బతుకమ్మా
నవ్వుల పండుగ బతుకమ్మా
దివ్వెల వెలుగుల మవ్వపు పాటల
తొవ్వల రవ్వల బతుకమ్మా
సుద్దులు పాడే బతుకమ్మా
ముద్దుగుమ్మలా బతుకమ్మా
సద్దులు పంచీ బతుకమ్మలనూ
చెరువున చేర్చే బతుకమ్మా
పట్టు చీరెల బతుకమ్మా
సొమ్ముల సోకుల బతుకమ్మా
కొప్పులనిండా మల్లెల ఘుమఘుమ
పల్లే పట్నం బతుకమ్మా
– తుమ్మూరి, 9701522234