పాక్‌కు బీసీసీఐ బాస్‌!

BCCI boss for Pakistan!– పీసీబీ విందుకు హాజరు కానున్న బిన్ని
ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్ని పాకిస్థాన్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నాడు. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్‌ ఆరంభం కానుండగా.. ఆతిథ్య బోర్డుగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సభ్య దేశాలకు లాహోర్‌లో విందు ఇస్తోంది. ఆసియా కప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరు దేశాల క్రికెట్‌ బోర్డు ఉన్నతాధికారులు ఈ విందుకు రానున్నారు. ఈ మేరకు పీసీబీ మేనేజింగ్‌ కమిటీ చీఫ్‌ జకా అష్రాఫ్‌ ఆగస్టు 15న బీసీసీఐ అధ్యక్షుడికి ఆహ్వానం పంపారు. బోర్డు సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాతో కలిసి రోజర్‌ బిన్ని పాక్‌ పర్యటనకు వెళ్లనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 2న పల్లెకల్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించనున్న రోజర్‌ బిన్ని, రాజీవ్‌ శుక్లా ఆ తర్వాతి రోజే పాకిస్థాన్‌కు చేరుకోనున్నారు. ఆసియా కప్‌ అధికారిక విందు అనంతరం కుదిరితే అక్కడ ఓ మ్యాచ్‌కు హాజరయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలు క్షీణ దశకు చేరుకున్న తరుణంలో భారత క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు పాకిస్థాన్‌లో అడుగుపెట్టడం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మెన్‌ హోదాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విందుకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.